డంపింగ్ యార్డు కాలుష్యంతో 18 గ్రామాలు ఉక్కిరి బిక్కిరి..!

by Nagam Mallesh |
డంపింగ్ యార్డు కాలుష్యంతో 18 గ్రామాలు ఉక్కిరి బిక్కిరి..!
X

దిశ, జవహర్ నగర్: ఏళ్లు గడుస్తున్నా జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు కాలుష్యం తగ్గట్లేదు. చుట్టుపక్కల 18 గ్రామాల ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారు. దుర్వాసనతో శ్వాస తీసుకోలేక, వాడుకోలేని విధంగా తయారైన భూగర్భ జలాలతో అవస్థలు పడుతున్నారు. కొంత విస్తీర్ణంలో పంట పొలాలూ విషతుల్యమయ్యాయి.

నిర్వహణ లోపాలే కారణం..

వ్యర్థాల నిర్వహణ లోపాలే అందుకు కారణమని ఇక్కడి ప్రజలు గగ్గోలుపెడుతున్నారు. డంపింగ్‌యార్డు నుంచి విడుదలయ్యే మురుగునీటితో పక్కనున్న 50 ఎకరాల మల్కారం చెరువు రసాయన సాగరాన్ని తలపిస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గతంలో అందుకు సంబంధించిన లోపాలపై ఈపీటీఆర్‌ఐ(పర్యావరణ పరిరక్షణ, శిక్షణ పరిశోధన సంస్థ) 2018 చివరి త్రైమాసికంలోనూ నివేదిక రూపొందించింది. దాని ఆధారంగా రాంకీ సంస్థకు జీహెచ్‌ఎంసీ రూ.1.79 కోట్ల జరిమానా విధించడం తెలిసిందే. గత ప్రభుత్వం లీచేడ్ ప్లాంట్ పునరుద్దరణ చేపట్టినా రాంకీ సంస్థ నిర్వహణలో నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంతోనే సమస్యలు తీరడం లేదని, మళ్ళీ ఈపీటీఆర్‌ఐ (పర్యావరణ పరిరక్షణ, శిక్షణ పరిశోధన సంస్థ) స్పందించి పూర్తిస్థాయిలో పర్యవేక్షించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నిరసనగా జేఏసీ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో...

సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు వెళ్ళే ప్రధానరోడ్డులో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలువురు నాయకులు మాట్లాడుతూ... సుమారు 70 ఎకరాలకు పైగా హెచ్ఎండీఏ భూములను రాంకీ సంస్థకు అప్పగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ భూమిని కేటాయించడం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకమని మండిపడ్డారు. అధికారుల సమన్వయం లోపం ప్రభుత్వ భూముల్లో లీజుకున్న సంస్థలు అవకాశంగా మలుచుకొని ఇష్టాను రాజ్యాంగ ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నాయని ధ్వజమెత్తారు. కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను బడా సంస్థలు దందుకుంటున్నారని అరోపించారు. ఇదే విషయంపై జిల్లా అధికారులను సమాచారం కోరగా ఎలాంటి సమాధానం దొరకలేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో హెచ్ఎండిఏ, రెవెన్యూ, హైడ్రా తదితర ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు అందజేసి, తమ గోడును విన్నవిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేతేపల్లి పద్మా చారి,ఏనుగు సంజీవ రెడ్డి, గావిని స్వర్ణ శ్రీనివాస్, ఈగ శ్వేత, మారం సమ్మి రెడ్డి, ఏనుగు సుదర్షన్ రెడ్డి, శాంతి రెడ్డి, గోగుల రామక్రిష్ణ, పోతరాజు రాములు, మాదిరెడ్డి రవికుమార్ రెడ్డి, సిలేష్, సందీప్, మహిందర్ శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed