బెంబేలెత్తిస్తున్న గ్రామ సింహాలు..ఆరేళ్ల బాలుడిపై దాడి

by Aamani |
బెంబేలెత్తిస్తున్న గ్రామ సింహాలు..ఆరేళ్ల బాలుడిపై దాడి
X

దిశ, సంగారెడ్డి : గ్రేడ్- వన్ మున్సిపాలిటీలో గ్రామ సింహాలు స్వైర్య విహారం చేస్తున్నాయి. సంగారెడ్డి పట్టణంలోని 38 వార్డుల్లో పదుల సంఖ్యలో కుక్కలు గుంపులుగా తిరుగుతున్నాయి. ఉదయం చిన్నపిల్లలు పాఠశాలలకు వెళ్లే సందర్భంలోనూ కుక్కలు వారిపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు శ్రీనగర్ కాలనీ మంజీర ఆసుపత్రి సమీపంలో ఆరేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. బాలుడికి కింద పడేసి గాయపరిచాయి. చుట్టు పక్కల ఇండ్ల వారు ఇళ్ల నుంచి బయటకు వచ్చి కుక్కలను తరిమివేయడంతో బాలుడికి ప్రమాదం తప్పింది. ఎవ్వరూ గమనించకుంటే బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఇది వరకు కూడా పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రజలపై కుక్కలు దాడి చేశాయి. దీనిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపానపోలేదు. కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలి కానీ అధికారుల అలసత్వం ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది.

కుక్కల నివారణకు బడ్జెట్ లో నిధులు..

మున్సిపాలిటీలో కుక్కల నివారణ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారు. ఆ నిధులతో కుక్కలను పట్టుకుని పట్టణానికి దూర ప్రాంతంలో, లేదా అటవీ ప్రాంతంలో వదిలి వేయాల్సి ఉంటుంది. కానీ ప్రత్యేకంగా కేటాయించిన నిధులను మున్సిపల్ అధికారులు ఖర్చు చేసిన దాఖలాలు లేవు. సరికదా వాటిని ఖర్చు చేసిన తప్పులు లెక్కలు చూపించి వాటిని మింగుతున్నారు. ప్రతి రోజు కుక్కల బెడద తప్పడం లేదు. తమ ఇంటి నుంచి బడులకు వెళ్లే చిన్న పిల్లల సంరక్షణ లేదనీ గల్లీలో వీధి కుక్కలు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాయో అనే భయంతో వణికి పోతున్నారు. మున్సిపల్ శాఖ అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం కనిపిస్తున్నది.

కుక్కల నుంచి కాపాడండి మహాప్రభో అంటూ ప్రజలు ఫిర్యాదులు చేసిన మా కెందుకులే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా కుక్కలను పట్టుకుంటున్నాం, వాటికి కుటుంబ నియంత్రణ శాస్త్ర చికిత్సలు చేసి ఏ గల్లీ కుక్కలు ఆ గల్లీలోనే వదిలివేస్తున్నామని మున్సిపల్ అధికారులు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. ఓ వైపు ప్రజలపై కుక్కలు దాడులు చేస్తుంటే వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేస్తున్నారంటా..ఇదేమి చిత్రమో అంటూ పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుంపులు గుంపులుగా స్వైర్య విహారం..

సంగారెడ్డి మున్సిపాలిటీలోని 38 వార్డుల్లోను కుక్కలు గుంపులుగా స్వైర్య విహారం చేస్తున్నాయి. కాలినడక వచ్చిన వారిపైనే కాకుండా బైక్ లపై వచ్చిన వారిని వెంటపడి తరుముతున్నాయి. సంగారెడ్డిలోని ఎస్పీ కార్యాలయం వెళ్లే దారిలోని బాబా నగర్ లో ఓ బైక్ పై వెల్తున్న వారిపై దాడులకు ప్రయత్నించగా బైక్ రైడర్ వేగంగా బైక్ ను నడపడంతో వెనకాల ఉన్న తన కూతురు బైక్ పై నుంచి ఎగిరిపడి తీవ్రగాయాల పాలయ్యింది. అదే విధంగా కార్ల వెంబడి కూడా పరుగెత్తుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాత్రి వేళల్లో ఆయా కాలనీవాసులు వారి కాలనీలకు వెళ్లాలంటనే జంకుతున్నారు. ఒంటరిగా వెళ్లేందుకు బయపడుతూ తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తున్నారు. లేదంటే ఒంటరిగా వచ్చే వారిపై దాడులకు పాల్పడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రజలు దాడులకు పాల్పడుతున్న కుక్కల బారి నుంచి కాపాడాలని సంగారెడ్డి మున్సిపల్ వాసులు కోరుతున్నారు.

Next Story