స్వర్ణ కిరీటంతో దర్శనమిచ్చిన వర్గల్ విద్యా సరస్వతి

by Aamani |
స్వర్ణ కిరీటంతో దర్శనమిచ్చిన వర్గల్  విద్యా సరస్వతి
X

దిశ,వర్గల్: ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యా సరస్వతి శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా బుధవారం మూల నక్షత్ర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారు జామున వేదమూర్తులైన బ్రాహ్మణోత్తముల మంత్రోశ్చరణల మధ్య ఆలయ వ్యవస్థాపక చైర్మన్ , బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి మూల నక్షత్ర విశేష పూజలకు అంకురార్పన చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి పుష్పగిరి పీఠాధిపతి శ్రీ నృసింహ భారతి స్వామీజీ మహాభిషేకము, విశేష పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష పుష్పార్చన, చండీ హోమం, పుస్తక స్వరూపిణి సరస్వతి పూజ, చతు శష్ట్యుపచార పూజలు, సప్తశతి పారాయణం, మూలమంత్ర హవనము తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా శ్రీ విద్యా సరస్వతి మాత స్వర్ణ కిరీటంతో భక్తులకు దివ్యదర్శనం కల్పించారు . తెల్లవారుజాము నుండి సాయంత్రం ఐదు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగగా , తమ పిల్లలకు భక్తులు అక్షర స్వీకారం చేయించారు . ఈ కార్యక్రమాల్లో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర నృసింహ భారతి స్వామి, శ్రీ గురుమదనానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి, మిషన్ భగీరథ ఈన్సి చంద్రమౌళి, ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు . అలాగే వేలాదిగా తరలివచ్చిన భక్తులకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలతో పాటు మహా ప్రసాదం అందజేశారు.

నేత్రపర్వంగా లక్షపుష్పార్చన..

శ్రీ విద్యా సరస్వతీ దేవిగా కొలువైన అమ్మవారి సన్నిధిలో ముఖమండపం వద్ద భక్తజనం బారులు తీరి కూర్చుని సామూహిక లక్ష పుష్పార్చనలో భాగస్వాములయ్యారు. అమ్మవారి నామం పఠిస్తూ కనకాంబరం, గులాబీ, చామంతి తదితర పూలను సమర్పిస్తూ భక్తిపారవశ్యంతో మునిగిపోయారు. వర్గల్ సరస్వతీ మాత సన్నిధిలో గురువారం చిన్నారుల అక్షరాభ్యాసాలు కొనసాగాయి. నవరాత్రోత్సవ వేళ పంచమి శుభకరంగా భావించి పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ చిన్నారుల అక్షరాభ్యాసాలకు తరలివచ్చారు.

నృత్యం...నేత్రపర్వం

వర్గల్ క్షేత్రంలో చిన్నారుల నృత్యాభియాలు నేత్రపర్వం చేశాయి. హైదరాబాద్ బోయిన్ పల్లి రాధ నృత్య నిలయం చిన్నారుల భరతనాట్య ప్రదర్శన ఆహూతులను అలరించింది. అష్టలక్ష్మిలను నృత్యాభినయంతో కీర్తించారు.



Advertisement

Next Story

Most Viewed