HYD: రెండు రోజుల్లో ముగుస్తున్న గడువు.. సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి

by Ramesh Goud |
HYD: రెండు రోజుల్లో ముగుస్తున్న గడువు.. సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి
X

దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లుల బకాయింపుల చెల్లింపునకు ప్రభుత్వం ప్రకటించిన వన్ టైమ్ సెటిల్ మెంట్-2024 (ఓటీఎస్) పథకం తుది గడువు సమీపిస్తోంది. మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల 30వ తేదీతో బిల్లులు చెల్లించే గడువు పూర్తవుతుంది. ఈ లోపు ఓటీఎస్ ను ఉపయోగించుకున్న వినియోగదారులకు పెండింగ్ లో ఉన్న అసలు మొత్తం కడితే.. ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. గడువు పూర్తయ్యాక చెల్లిస్తే పెండింగ్ బిల్లుల మీద వడ్డీతో పాటు ఫెనాల్టీ కట్టాల్సి వస్తుంది.

అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ పథకం ఆ నెల చివరి వరకు కొనసాగింది. అయితే పండగలు రావడం, ప్రజలు సొంతూళ్లకు వెళ్లడం, ఆర్థిక భారం పడటంతో పథకాన్ని సరిగా వినియోగించుకోలేకపోయారు. పథకం గడువు పెంచాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో జలమండలి.. పథకం గడువును పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. మరో నెల అంటే నవంబర్ ఆఖరి వరకు పొడిగించేందుకు అనుమతి ఇచ్చింది. ప్రజల నుంచి వినతులు రావడంతో ఇప్పటికే ఒకసారి గడువు పెంచిన ప్రభుత్వం.. ఈ పథకాన్ని మరోసారి పెంచే అవకాశం లేనందున, నిర్ణీత గడువులో సద్వినియోగం చేసుకోవాలని జలమండలి అధికారులు కోరుతున్నారు. పథకం గడువు ముగిసిన అనంతరం... పెండింగ్ బిల్లుల వినియోగదారులపై కఠిన చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. అవసరమైతే వారి నల్లా కనెక్షన్ సైతం తొలగించనున్నారు.

బిల్లులు చెల్లించే విధానం

జలమండలి కార్యాలయాలు, ఆన్ లైన్ విధానంలో మీ-సేవ, ఏపీ ఆన్ లైన్ కేంద్రాలు, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, NEFT, RTGS, BPPS, జలమండలి అధికారిక వెబ్ సైట్, లైన్ మెన్ల ద్వారా చెల్లించవచ్చు. జలమండలి అందించిన QR Code ను స్కాన్ చేయడం ద్వారా.. వినియోగదారులు తమ బకాయిలు, చెల్లించే మొత్తం, రాయితీ తదితర వివరాలు తెలుసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed