- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూదాన్ భూములకు రెక్కలు..! ధరణి పోర్టల్‌తో పట్టాగా మార్పు
దిశ, తెలంగాణ బ్యూరో: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల భూదాన్ భూములు ప్రైవేటుపరం అయ్యాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 21,939 ఎకరాల భూదాన్ భూములు ఉండేవి. వాటిలో 13,574 ఎకరాల భూమిని అసైన్ చేశారు. అందులో పంపిణీకి నోచుకోకుండా ఉన్నవి 341 ఎకరాలే. కాగా, అసైన్ చేసిన భూమిపై ఎలాంటి లావాదేవీలు చేపట్టరాదన్న నిషేధం ఉన్నది. అయితే ఇదే అదనుగా కొందరు బడా బాబులు ఆ భూములను కొనుగోలు చేశారు. అనుకూల అధికారులు రాగానే పట్టాగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత నాలా కన్వర్షన్ చేసుకొని.. హెచ్ఎండీఏ అనుమతులు పొంది ప్లాట్లుగా అమ్మేశారు. ఇలా వందలాది ఎకరాల భూదాన్ భూమి మాయమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. 2017కి ముందు, 2024 తర్వాత భూదాన్ భూముల లెక్క తేల్చితే చాలు.. ఎన్ని ఎకరాలు పట్టాగా మారిందో, ఎన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయో? అంచనా వేయొచ్చనే అభిప్రాయమున్నది.
అధికారుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూములపై చోటుచేసుకున్న అక్రమాల వ్యవహారంలో అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. అప్పటి రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ పైన చాలా మంది బాధితులు ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ జరిపింది. భూ బదలాయింపుల్లో చోటు చేసుకున్న లావాదేవీల్లో అనేక అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. అమోయ్ పై కేసు నమోదు చేయాలని ఈడీ సిఫారసు చేయడం సంచలనంగా మారింది. ఇంకా అప్పటి ఆర్డీవో వెంకటాచారి, మహేశ్వరం తహశీల్దార్ ఆర్పీ జ్యోతి ను సైతం ఈడీ విచారించింది. అమోయ్ కలెక్టర్ గా పని చేసిన కాలంలో చోటు చేసుకున్న అక్రమాలపై ప్రశ్నించింది. ప్రధానంగా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నం.181లోని 42 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పార్టీకి కట్టబెట్టడం వెనుక జరిగిన తతంగంపైనా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. మహేశ్వరం పోలీసు స్టేషన్ లో నమోదైన కేసు వివరాలను కూడా స్టడీ చేసింది. తహశీల్దార్ ఆర్డీవోపై సైతం కేసులు నమోదు చేయాలని రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది.
2017 తర్వాతే క్లియరెన్స్!
ఒక్క మహేశ్వరం మండలంలోనే కాకుండా.. మొయినాబాద్, కందుకూరు, యాచారం, ఇబ్రహింపట్నం, అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్, గండిపేట మండలాల్లోని భూదాన్ భూములను కూడా 2017 తర్వాతే క్లియర్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ధరణి పోర్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల వెబ్ సైట్ లోని నిషేధిత జాబితాలో భూదాన్, ప్రభుత్వ భూములుగా పేర్కొన్నవి కూడా హెచ్ఎండీఏ అనుమతులు పొంది ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేస్తున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఇదంతా రెవెన్యూ, హెచ్ఎండీఏ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారుల మాయాజాలమే. అప్పటి తహశీల్దార్లు రికార్డులు సరిగ్గా పరిశీలించకుండా.. లేదంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకో గానీ.. పాజిటివ్ రిపోర్ట్ పంపారు. దాంతో భూదాన్ భూములు కాస్త పట్టాగా మారాయి. ఈ నాలుగేండ్లల్లో ఎన్ని వందల ఎకరాల భూమి ప్రభుత్వ/భూదాన్ గా ఉన్న క్లాసిఫికేషన్ ని పట్టాగా మార్చారో అబ్ స్ట్రాక్ట్ తీస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావు. అయితే అప్పుడు రికమండ్ చేసిన కొన్ని ఫైళ్లకు.. ఇప్పుడు రిజెక్ట్ రిపోర్టులు పంపిస్తున్నట్లు తెలిసింది.
సిరిగిరిపూర్‌లో భూదాన్ మార్పిడి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపూర్ లో చేస్సాలా ప్రకారం సర్వే నం.68 లో 16.37 ఎకరాలు దోమ రామచంద్రమ్మ పేరిట ఉంది. 2015–16 పహానీ ప్రకారం ఆమెకు 14.19 ఎకరాలుగా నమోదైంది. మిగతాది భూదాన్ లిస్ట్ ప్రకారం తడకల్ వెంకయ్యకు 0.25 ఎకరాలు, తడకల పెద్ద యాదయ్యకు 0.25 ఎకరాలు, తడకల లక్ష్మయ్యకు 0.25 ఎకరాలు, తడకల ఎల్లయ్యకు 0.20 ఎకరాలు అసైన్ చేశారు. షౌక్ మహమూద్ కి రామచంద్రమ్మ 14.24 ఎకరాలు అమ్మేసినట్లు చెప్పి కోర్టులో కేసు దాఖలు చేశారు. అలాగే 2 ఎకరాలు టి.పద్మమ్మకు అమ్మినట్లు చెప్తున్నారు. ఆ తర్వాత వాటి నుంచి 121 డాక్యుమెంట్లు తయారయ్యాయి. ప్లాట్లుగా చేసి లావాదేవీలు నడిపారు. షేక్ అహ్మద్ అనే వ్యక్తి నాలా కన్వర్షన్ కూడా చేసి ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారని తెలిసింది. సర్వే నం.69 లో 5.37 ఎకరాలు మాత్రం వ్యవసాయ భూమిగా ధరణి రికార్డులు చెప్తున్నాయి. రామచంద్రమ్మ భూదానం చేసినట్లు రికార్డులు ఉన్నాయి. అది భూదాన్ భూమి కావడం వల్లే కొందరికి అసైన్ చేసినట్లు స్పష్టమవుతుంది. అయితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారిక వెబ్ సైట్ లో సర్వే నం.68లోని 16.34 ఎకరాలను, 69 లోని 5.37 ఎకరాలను నిషేదిత జాబితాలో నమోదు చేశారు. క్లాసిఫికేషన్ లో భూదాన్ ల్యాండ్ కి బదులుగా ఖారిజ్ ఖాతాగా పేర్కొన్నారు. భూదాన్ భూముల జాబితా, నిషేధిత జాబితాల ప్రకారం వీటిపై ఎలాంటి క్రయ విక్రయాలు జరగొద్దు. ఇలాంటి తరుణంలో మహేశ్వరం తహశీల్దార్ సేల్ డీడ్స్, మ్యుటేషన్, నాలా కన్వర్షన్ చేయడం వెనుక ఏం జరిగింది? ఏ ఆధారాలతో ఈ భూములపై లావాదేవీలకు అనుమతులు ఇచ్చారు? జిల్లా స్థాయి అధికారులెవరైనా మౌఖిక ఆదేశాలు జారీ చేశారా? లేదంటే లిఖితపూర్వక ఉత్తర్వులు ఇచ్చారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే సర్వే నంబర్లలో డీఆర్ఎస్ సన్ లైట్ ప్రాజెక్ట్స్ పేరిట భూములు ఉన్నాయి.
కనకమామిడిలో క్లాసిఫికేషన్ చేంజ్!
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడిలోనూ భూదాన్ భూముల దందా నడిచింది. చెస్సాలా పహానీ 1955–58 ప్రకారం సర్వే నం.265లో 2.35 ఎకరాలు బాలయ్య పేరిట పట్టా భూమి ఉంది. ఆ తర్వాత భూదాన్ ల్యాండ్ గా క్లాసిఫికేషన్ వచ్చింది. భూదాన్ యజ్ఞ బోర్డు కూడా ఇది తమ ల్యాండ్ అంటూ నిషేదిత జాబితాలో పెట్టించింది. అయితే గతంలో ఈ మండలంలో పని చేసిన తహశీల్దార్ దీన్ని పట్టా ల్యాండ్ గా మార్చాలంటూ రికమండ్ చేశారు. ఇలా అనేకం క్లాసిఫికేషన్ మార్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత తహశీల్దార్ కే గౌతమ్ కుమార్ మాత్రం నాట్ రికమండ్ అంటూ మరో ఫైల్ కలెక్టర్ కి పంపారు. ఇలాంటివి మొయినాబాద్ మండలంలో ఇంకెన్ని జరిగాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటివి ఎన్నెన్నో..
* అబ్దుల్లాపూర్ మెట్ మండలం పిగ్లిపురం సర్వే నెం.17లో 60 ఎకరాలను ఎవరికి కట్టబెట్టారు? అక్కడ వెలిసిన విద్యా సంస్థల భూములు ఎవరివి? వారికి ఎలా వచ్చాయో లింక్ డాక్యుమెంట్లు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అలాగే తారామతిపేట సర్వే నెం.215, 216, 217లో 59.10 ఎకరాలు ఏమయ్యాయి? కుంట్లూరు దగ్గర పాపాయిగూడలో సర్వే నెం.219, 224ల్లో 82.39 ఎకరాలు అన్యాక్రాంతంపైనా విచారణ జరిపితే నిజాలు తెలుస్తాయి.
* గండిపేట మండలం వట్టినాగులపల్లి సర్వే నెం.186, 187, 188, 189లోని 29.26 ఎకరాలు ఎవరి పేరిట మారిందో విచారణ చేయాలి.
* మహేశ్వరం మండలం నాగారంతోపాటు మంఖల్ సర్వే నెం.132, పోరండ్ల సర్వే నెం.17 లో భూదాన్ భూమి ఎక్కడికి పోయిందో చూడాలి.
* మహేశ్వరం మండలం మంఖల్ సర్వే నెం.447, 449, 450, 453లో 55.35 ఎకరాలు, అబ్దుల్లాపూర్ మెంట్ మండలం పాపాయిగూడ సర్వే నెం.215, 224లో 100 ఎకరాలు, ఇబ్రాహింపట్నం మండలం ఆదిభట్ల సర్వే నెం.51, 52, 53లో సుమారు 30 ఎకరాలు, కూకట్‌పల్లి సర్వే నెం.353, 354లో 24.26 ఎకరాలు, అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం సర్వే నెం.319లో 13.35 ఎకరాల భూమి స్టేటస్ పై విచారణ జరిపించాలి.
వట్టినాగులపల్లిలో బినామీల దందా (బాక్స్)
గండిపేట మండలం వట్టినాగులపల్లి సర్వే నెం.186, 187, 188, 189 నంబర్లలో రూ.వందల కోట్ల విలువైన 29.27 ఎకరాల భూదాన్ భూమి ఎవరు, ఎవరికి అసైన్ చేశారు. ఇప్పుడు ఎవరి పేరిట ఉన్నాయి? ఆ క్రయవిక్రయాలకు ఊతమిచ్చింది ఎవరు? భూదాన్ భూములకు క్లియరెన్స్ ఇచ్చిన కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ లు ఎవరనే చర్చ జరుగుతున్నది. అత్యంత ఖరీదైన భూములను కాపాడకుండా కంపెనీలకు, లీడర్లకు కట్టబెట్టడం వెనుక ఏం జరిగిందో విచారణ చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. నిజానికి ఆ భూమిని బోర్డులోని సభ్యుల బినామీల పేరిట 2006 జూన్ 12న పట్టాలు ఇచ్చారు. 60 మంది లబ్దిదారుల జాబితాను రూపొందించారు. అయితే రాజేంద్రనగర్ ఆర్డీవో 2007 ఫిబ్రవరి 15న భూ మార్పిడికి ఉత్తర్వులు నెం.డి/8616/2005ను జారీ చేశారు. ఈ 60 మంది సదరు 29.27 ఎకరాలను అమ్మేందుకు ప్రయత్నాలు సాగాయి. ఈ గందరగోళం నేపధ్యంలోనే భూదాన్ బోర్డు పట్టాలను రద్దు చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. అలాంటప్పుడు ఈ భూమి పెద్దల వశం కావడం వెనుక ఏం జరిగిందో దర్యాప్తు చేయాలి.