ఎస్సై వేధింపులు భరించలేక మహిళా ఏఎస్సై ఆత్మహత్యాయత్నం

by Kalyani |
ఎస్సై వేధింపులు భరించలేక మహిళా ఏఎస్సై ఆత్మహత్యాయత్నం
X

దిశ, చిలిపి చెడ్ :మెదక్ జిల్లా చిలిపిచెడ్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ సుధారాణి ఆత్మహత్యాయత్నం చేశారు. ఎస్సై యాదగిరి తనను వేధిస్తున్నాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎస్ఐ గా చిలప్ చేడ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ విధులకు హాజరుకానట్లు కానిస్టేబుల్స్ తో రికార్డులో వేయిస్తున్నారని, కావాలనే టార్గెట్ చేశారని తెలిపారు. సూసైడ్ నోట్ రాసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య ప్రయత్నం చేసిన సుధారాణిని పోలీస్ వాహనంలో జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఎస్సై యాదగిరి పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పై అధికారి తనను వేధిస్తున్నారంటూ బాహాటంగా సూసైడ్ నోట్ రాసి మరి ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఏఎస్ఐ ఇంతకీ ఆ పోలీస్ స్టేషన్ లో ఏం జరిగి ఉంటుంది..? అనే కోణంలో అటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై ఎస్సై యాదగిరిని వివరణ కోరగా తనకు ఇది వరకే ఓ వివాహం కాగా మరో వివాహం చేసుకుందని, మొదటి వివాహం చేసుకున్న భర్తతో కొంత వేధింపులు ఉండేవని ఈ విషయంపై న్యాయం చేయాలని తనను కోరినట్లు ఆయన తెలిపారు. ఆమెను వేధిస్తున్నట్లు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని ఆయన అన్నారు. దానిని ఆసరాగా తీసుకుని ఈ బురదను నాపై చల్లే ప్రయత్నం చేస్తుందని ఆయన తెలిపారు. నేను విధులకు మాత్రమే తప్పక హాజరు కావాలని తెలుపగా ఆమె నాపై కక్ష కట్టి ఈ విధంగా ఆరోపణలు చేస్తోందని ఆయన తెలిపారు.

విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటాం : డీఎస్పీ

ఈ సంఘటనపై తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి స్పందించారు. గురువారం నాడు చిలిపిచేడ్ పోలీస్ స్టేషన్ కు హాజరై జరిగిన సంఘటనకు గల కారణాలను ఎస్సై యాదగిరిని అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ మహిళ ఏఎస్ఐ అతనిపై ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామని డీఎస్పీ వెంకట్ రెడ్డి అన్నారు. ఆయనతోపాటు నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి ఉన్నారు.

Advertisement

Next Story