ఏడుపాయల్లో ఈవో నిర్లక్ష్య వైఖరి పై భక్తుల ఆగ్రహం..

by Kalyani |
ఏడుపాయల్లో ఈవో నిర్లక్ష్య వైఖరి పై భక్తుల ఆగ్రహం..
X

దిశ, పాపన్నపేట: వర్షాలతో సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో దిగువకు నీటిని వదిలిన సంగతి తెలిసిందే. నీటిని దిగువకు వదిలితే దేశంలోనే రెండో వన దుర్గామాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన, పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంటుందనే సంగతి కూడా తెలిసిందే. వరద నీరు ప్రవహిస్తుండడంతో ఏడుపాయల్లోని ఆయా ప్రాంతాల్లో నాచు పట్టి భక్తులు జారిపడి గాయాలపాలవుతున్నా కనీసం ఈవో అటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. ఈవో కార్యాలయం ఎదురుగా ఈ సంఘటనలు జరుగుతున్నా ఈవో కంటి చూపు మేరలో ఉండి కూడా పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏడుపాయల ఈవో కార్యాలయం ముందు వరద మూలంగా మొత్తం నాచు పట్టింది. అక్కడ నీటిలో కాళ్లు కడుక్కుందామని వెళ్లిన భక్తులు ఎంతోమంది జారి పడుతున్నారు. నాచును తొలగించే ప్రయత్నం చేయకపోగా, భారీకేడ్లు అయినా ఏర్పాటు చేసి భక్తులు అటు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. చాలామంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా అక్కడ ఏ ఒక్కరినీ నియమించక పోవడం తో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈవో కార్యాలయం ఎదురుగానే కాకుండా అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీర నది పాయలో ఇలాంటి ప్రదేశాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా ఈవో చర్యలు చేపట్టడం లేదని భక్తులు మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed