వైద్య రంగంలో దేశంలోనే మొదటి స్థానం తెలంగాణది : మంత్రి హరీష్ రావు

by Shiva |   ( Updated:2023-09-27 06:47:07.0  )
వైద్య రంగంలో దేశంలోనే మొదటి స్థానం తెలంగాణది : మంత్రి హరీష్ రావు
X

దిశ, మనోహరాబాద్ : వైద్య రంగంలో దేశంలోనే మొదటి స్థానం తెలంగాణదని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పర్యటనలో భాగంగా మనోహరాబాద్ లోని రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనోహరాబాద్‌లో పీహెచ్సీని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మనోహరాబాద్ మండలం చేయాలని గత ప్రభుత్వాలైన టీడీపీ, కాంగ్రెస్ హయాంలో జరగని దశాబ్ధాల కలను సీఎం కేసీఆర్ నిజం చేశారని మంత్రి గుర్తు చేశారు. ఈ రోజు మనోహరాబాద్ మండలమైందని, ఇక 24 గంటలు పనిచేసే పీహెచ్సీలో ప్రతి ఒక్కరూ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవలన్నారు.

ఉచితంగా అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ప్రజలకు ఉంటాయని తెలిపారు. గర్భిణులకు చెకప్‌లు కూడా ఇక్కడ జరుగుతాయని వెల్లడించారు. కేసీఆర్ సీఎం కాకపోయి ఉంటే మనోహరాబాద్ మండలం అయ్యేదా ఇక్కడ ఇంతటి అభివృద్ధి జరిగేదా అని మంత్రి ప్రశ్నించారు. త్వరలో మనోహరాబాద్ కి పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తామని అన్నారు. నేడు ప్రభుత్వాసుపత్రుల్లో 76 శాతం డెలివరీలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో కాన్పు అయితే, కేసీఆర్ కిట్ ఇచ్చి ప్రభుత్వ వాహనంలోనే ఇంటి దగ్గర దింపుతున్నామని అన్నారు. ఈరోజు పేద ప్రజల కష్టాలు అర్థం చేసుకుని కష్టాలు తీరుస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఎండాకాలంలో కూడా హల్దీ వాగు పారుతోందంటే సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు.

తాగేందుకు మంచినీళ్లు లేనిప్రాంతంలో నేడు ప్రతి ఇంటికి నీళ్లు వచ్చాయంటే కేసీఆర్ కృషి వల్లే అని వెల్లడించారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చేయని అభివృద్ధిని ఇప్పుడు చేస్తానంటే నమ్ముతారా..? అని మంత్రి ప్రశ్నించారు. ఈ రోజు కేసీఆర్ వచ్చారు కాబట్టే రైతుకు విలువ పెరిగిందని, భూమికి ధర పెరిగిందన్నారు. సద్ది తిన్న రేవు తలవాలి.. పని చేసిన కేసీఆర్‌ను ఆశీర్వదించాలి అని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ హేమలత, ఫారెస్ట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రమేష్, గడ అధికారి ముత్యంరెడ్డి, తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, స్థానిక సర్పంచ్ చిటుకుల మహిపాల్ రెడ్డి, ఎంపీటీసీ లతావెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం మహేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story