సత్వార్ @ 6.6…జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

by Kalyani |   ( Updated:2024-12-16 13:41:06.0  )
సత్వార్ @ 6.6…జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
X

దిశ, జహీరాబాద్: జహీరాబాద్ నియోజకవర్గంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరిగిపోవడంతో స్థానికులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. సొంత పనులపై బయటికి వస్తే చలి బారిన పడి వణుకి పోతున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని సత్వార్ గ్రామంలో ముందేన్నడు కనీవినీ ఎరగని రీతిలో సోమవారం అతి తక్కువగా 6.6 డిగ్రీల ఊష్ణోగ్రత నమోదైంది. అదే విధంగా న్యాల్కల్, కోహీర్ లో 6.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికి తోడుగా విరివిగా పడుతున్న పొగమంచు పరిసరాలను కమ్మేస్తోంది. మరో మూడు రోజుల వరకు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున నియోజకవర్గ వాసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప సూర్యోదయానికి ముందు ఇళ్ల నుంచి బయటికి రావద్దని సూచిస్తున్నారు. తప్పని పరిస్థితిలో బయటకు వస్తే స్వెటర్లు ఇతర చలి రక్షణ దుస్తులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రణాళిక అధికారులు సూచిస్తున్నారు.

గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్..

అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోవడం.. చలి గాలులతో చలి తీవ్రత పెరిగిపోవడానికి వాతావరణ మార్పుపై గ్లోబల్ వార్మింగ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆర్కిటిక్ సముద్రపు మంచు కరిగి కొన్ని ప్రాంతాలకు విపరీతమైన చలిని కలిగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా అటవీ నిర్మూలన , పట్టణీకరణతో కూడా త్వరితగతిన వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. పెద్ద ఎత్తున అటవీ నిర్మూలన వల్ల ట్రాన్స్‌పిరేషన్ (మొక్కల నుంచి నీటి విడుదల) శీతలీకరణ ప్రభావాలను తగ్గిస్తుంది. పట్టణీకరణ వేడిని బంధించే ఉష్ణ ద్వీపాలను సృష్టిస్తుంది.

రెండూ ఆయా ప్రాంతాల్లో అసాధారణ వాతావరణాన్ని తీవ్రతరం చేస్తాయి. ఎల్ నినో-సదరన్ ఆసిలేషన్ ఒక దశ అయిన లా నినా వాతావరణ నమూనాలను మార్చగలదు. ఇది తరచుగా వాతావరణ ప్రసరణ, జెట్ స్ట్రీమ్‌లను మార్చడం ద్వారా కొన్ని ప్రాంతాలలో సగటు కంటే చలి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్థిరమైన అధిక- పీడన వ్యవస్థలు వాతావరణ నమూనాల సాధారణ ప్రవాహాన్ని నిరోధిస్తాయి. ఒక ప్రాంతంలో చల్లని గాలిని బంధిస్తాయి. ఈ వ్యవస్థలు ఆర్కిటిక్ గాలిని తక్కువ అక్షాంశాలలోకి చిందించేలా ఒత్తిడి పెంచుతాయి. దీని ఫలితంగా దీర్ఘకాలం చలిగాలులు ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed