Sangareddy MLA : ఒకవైపు మందుల కొరత, మరో వైపు బడుల మూత

by Aamani |
Sangareddy MLA : ఒకవైపు మందుల కొరత, మరో వైపు బడుల మూత
X

దిశ,సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దొరకక రోగులు అవస్థలు పడుతుంటే, మరోవైపు ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూత పడే పరిస్థితి వచ్చిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు. వానాకాలం మొదలైనప్పటికీ పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు తీసుకోకపోవడం వల్ల జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో దోమలు విజృంభిస్తున్నాయని, దీంతో ప్రజలు మలేరియా, డెంగీ వంటి సీజనల్ రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైద్య కోసం సర్కారు ఆసుపత్రులకు వెళ్తే అక్కడ మందులు లేకపోవడంతో సరైన వైద్యం అందటం లేదని విమర్శించారు.

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రాంతీయ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. జిల్లాలోని 1247 పాఠశాలల్లో 1,111 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే పాఠశాలల్లో విద్యాబోధన ఎలా సాగుతుందో పాలకులే సమాధానం చెప్పాలన్నారు. జిల్లా విద్యాధికారులు పాఠశాలలు సందర్శిస్తే సమస్యలు వెలుగు చూస్తాయన్నారు. ప్రజా పాలన అంటూ ప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రికి పతనమవుతున్న విద్య, వైద్య శాఖల తీరు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story