- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘కల్యాణలక్ష్మీ’ పేరిట నిధులు స్వాహా..! బంధువుల పేరిట యథేచ్ఛగా చెక్కుల జారీ
దిశ, తెలంగాణ బ్యూరో: కాసులకు కక్కుర్తి పడిన కొందరు ఎంప్లాయిస్.. ఉన్నతాధికారులను బోల్తా కొట్టించి పేదలకు అందాల్సిన ఆర్థిక సాయం చెక్కులను మాయం చేస్తున్నారు. బంధువుల పేరిట చెక్కులు జారీ చేసి నిధులు స్వాహా చేస్తున్నారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలను ఎంపిక చేసుకొని పెళ్లి కాకపోయినా, ఆ మనుషులు లేకపోయినా సిబ్బందే దరఖాస్తు చేసి.. ఎంక్వయిరీ చేసినట్లుగా చూపి.. లబ్దిదారుల ఎంపిక జరిగినట్టు చూయించి చెక్కులు వచ్చేలా చేస్తున్నారు. అలా వచ్చిన నిధులను కొందరు సిబ్బంది సొంత ఖాతాలో జమ చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే వరంగల్ ఆర్డీవో కార్యాలయంలో జరిగిందని తెలిసింది. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ స్కీంలలో గోల్‌మాల్ చేసి రూ.లక్షల విలువైన చెక్కులను తమతో పాటు, తమ బంధుమితృల ఖాతాల్లోనూ జమ చేసుకున్నట్టు సమాచారం. విచారణ చేయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది చెక్కులు అర్హులకు చేరాయా? లేదా? అన్న విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది.
ఆర్డీవో కార్యాలయం నుంచే..
కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాల లబ్ధిదారులకు చెక్కుల జారీ ప్రక్రియ ఆర్డీవో కార్యాలయం కేంద్రంగానే జరుగుతున్నది. దరఖాస్తు చేసుకున్న తర్వాత తహశీల్దార్ కార్యాలయం విచారణ పూర్తి చేసి, సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే అనుమతి పొందాలి. ఆపై పూర్తి వివరాలతో వాటిని ఆర్డీవోకు సిఫారసు చేస్తారు. అక్కడ లబ్ధిదారుల వివరాలు మరోసారి పూర్తిగా పరిశీలించిన తర్వాత లబ్దిదారు పేరిట బ్యాంకర్ చెక్కులు జారీ చేస్తారు. కానీ వరంగల్ జిల్లాలోని ఓ ఆర్డీవో కార్యాలయంలో గతంలో విధులు నిర్వర్తించిన జూనియర్ అసిస్టెంట్ ఏకంగా కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల జారీపైనే గురి పెట్టారు. లబ్ధిదారుల పేరిట జారీ కావాల్సిన చెక్కులను తమ రక్త సంబంధీకుల పేరిట మార్పించుకొని వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయించుకొని విత్ డ్రా చేయించారన్న ఆరోపణలున్నాయి.
చెక్కుల కోసం క్యూ కడుతున్న లబ్ధిదారులు
కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు అందని లబ్ధిదారులు 2-3 ఏండ్లుగా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అక్కడి సిబ్బంది వారికి ఏదో సమాధానం చెబుతూ పంపించేస్తూ ఉన్నారు. ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా ఆ జూనియర్ అసిస్టెంట్ మరో తహశీల్దార్ కార్యాలయానికి బదిలీ కావడంతో ఈ అక్రమ చెక్కుల భాగోతం వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఇలా 17 చెక్కులు దారి మళ్లాయని తెలిసింది. కానీ ఇలా మాయమైన చెక్కులు సుమారు 100 వరకూ ఉంటాయని తెలుస్తున్నది.
నగదు రాబట్టే ప్రయత్నాల్లో ఉద్యోగులు!
అక్రమంగా సొమ్ము చేసుకున్న మొత్తాన్ని గుట్టు చప్పుడు కాకుండా రాబట్టేందుకు సదరు ఆర్డీవో కార్యాలయ ఉద్యోగులు యత్నిస్తున్నట్టు సమాచారం. తనకున్న ఆర్థిక ఇబ్బందులు తీర్చుకునేందుకు సదరు ఉద్యోగి ఈ ప్లాన్ చేశాడని, ప్రతిసారి ఓ బ్యాచ్ లబ్ధిదారుల పూర్తి వివరాలతో ఫైల్ నోట్ ఆమోదించాక.. ఉన్నతాధికారులతో ఉన్న సాన్నిహిత్యంతో చివరి క్షణంలో కళ్లు గప్పి బినామీల పేరుతో చెక్కుల జారీకి సిఫార్సు చేయించారని, అలా ఆర్డీవో సంతకం పూర్తయిన చెక్కులను నేరుగా కాజేశారని తెలుస్తోంది. ఈ తతంగానికి పాల్పడిన సదరు ఉద్యోగి రెండు నెలలుగా విధులకు సరిగా హాజరు కావడం లేదని సమాచారం. అతను వాడుకున్న సొమ్మును ఎలా తిరిగి రాబట్టాలా? అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విషయాన్ని పై అధికారులకు నివేదించకుండా తమ ఉద్యోగాలు కాపాడుకునే ప్రయత్నాల్లో వారు ఉన్నట్టు తెలిసింది.
ఎన్నికల కోడ్ ఉండగానే..
2018 ఎన్నికల్లోనూ సదరు ఉద్యోగి ఓ సారి కల్యాణలక్ష్మీ పథకం లబ్ధిదారుల వివరాలను ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే అప్పటి ఎమ్మెల్యేకి నేరుగా అధికారిక మెయిల్ నుంచి చెరవేశారని తెలిసింది. అయినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది. అదే ఆర్డీవో కార్యాలయంలో ఏండ్ల తరబడి పాతుకుపోయిన మరో ఉన్నతోద్యోగి సైతం గతంలో సుమారు రూ.11 లక్షల విలువైన పరిహారం చెక్కులను తప్పుడు ఖాతాల్లో జమ చేయించి, చివరికి ఉన్నతాధికారుల సాయంతో రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి, అతికష్టం మీద విడతల వారీగా వసూలు చేసి ఆర్డీవో ఖాతాలో జమ చేయడం గమనార్హం. కార్యాలయంలో తిష్టవేసి, అర్జీదారులని ఇబ్బందులకు గురి చేస్తున్నా నేటికీ ఆయన్ను బదిలీ చేయకపోవడం విడ్డూరంగా ఉంది.
విచారిస్తే.. మరిన్ని నిజాలు వెలుగులోకి
రాష్ట్ర వ్యాప్తంగా కల్యాణలక్ష్మీ చెక్కులు రాలేదంటూ లబ్దిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. వాస్తవంగా వారిని ఎంపిక చేశారా? లేదా? ఎంపిక చేస్తే చెక్కులు ఇవ్వకుండా కాలయాపన చేసేందుకు అవకాశమే లేదు. ఈ మూడేండ్ల కాలంలో వచ్చిన అప్లికేషన్లు, పంపిణీ చేసిన చెక్కుల వివరాలు, లబ్దిదారుల జాబితాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. లబ్దిదారుల పేరిట మరొకరికి చెక్కులు అందాయా? వాస్తవమైన కుటుంబాలకే అందజేశారా? అనే లెక్క సైతం తేలే అవకాశం ఉంది. వరంగల్ జిల్లాలోని ఓ ఆర్డీవో కార్యాలయంలోని భాగోతం ఇంకెన్ని కార్యాలయాల్లో చోటు చేసుకుందో అనే విషయాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని పలువురు పేర్కొంటున్నారు.