- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Caste Census: కులగణనపై ఉత్కంఠ.. వచ్చే నెల 6 నుంచి ప్రక్రియ ప్రారంభం
దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ప్రత్యేక కమిషన్‌ను నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు సరికొత్త చర్చకు ఆస్కారం ఇచ్చినట్లయింది. బీసీల రాజకీయ వెనకబాటుతనంపై అధ్యయనం చేసే బాధ్యతను స్టేట్ బీసీ కమిషన్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం జరిగిన విచారణ అనంతరం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.
ఈ తీర్పును ప్రభుత్వం ఆమోదిస్తుందా? సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా? బీసీల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పిటిషన్ దాఖలు చేసిన ఆర్.కృష్ణయ్య ఉపసంహరించుకుంటారా? ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణనతో బీసీల రాజకీయ వెనకబాటుతనంపై వివరాలు లభ్యం కానున్నాయి. ఈ డేటా ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ ఖరారు కానున్నది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నేరుగా బీసీల రిజర్వేషన్‌కు సంబంధించిన అంశమే అయినా కులగణనపై పరోక్షంగా ప్రభావం పడనున్నది.
డిసెంబర్ 7 నాటికి పూర్తి చేసేలా టార్గెట్
హైకోర్టు తాజా ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కులగణన వచ్చేనెల 6 నుంచి యథావిధిగా ప్రారంభమవుతుందా? డిసెంబరు 7వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున అప్పటికల్లా కొత్త కమిషన్‌ను ప్రభుత్వం నియమిస్తుందా? ఆ వివరాల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారవుతాయా? లేక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే బీసీ రిజర్వేషన్ అంశం నిర్ణయానికి నోచుకోకుండా మరింత ఆలస్యమవుతుందా? దాని వెన్నంటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనకు తాత్కాలికంగా బ్రేక్ పడుతుందా? ఇలాంటి చర్చలు మొదలయ్యాయి.
కులగణన హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నేరుగా కులగణనకు సంబంధించిన అంశం కాకపోయినా ఈ సర్వేలో వెల్లడయ్యే వివరాల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. హైకోర్టు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించే కొత్త కమిషన్ చేస్తుందా? లేక స్టేట్ బీసీ కమిషన్ చేస్తుందా? దీనిపై త్వరలో స్పష్టత రానున్నది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో కులగణనకు ఎలాంటి సంబంధం లేదని, షెడ్యూలు ప్రకారం యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు కంపల్సరీ..
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే బీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేయడం తప్పనిసరి షరతు ఉంది. గతంలోనే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని నొక్కిచెప్పింది. రిజర్వేషన్లు ఖరారు కావాలంటే బీసీల రాజకీయ వెనకబాటుతనంపై స్పష్టత రావాల్సి ఉంటుంది. ఇందుకోసం తెలంగాణ హైకోర్టు గతంలో దాఖలైన ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ‘ట్రిపుల్ టెస్ట్’ అంశాన్ని ప్రస్తావించింది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ‘డెడికేటెడ్ బీసీ కమిషన్’ ఉండాలి... బీసీ ఓటర్ల సంఖ్య తేలాలి... ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లన్నీ కలిపి మొత్తం 50% దాటకూడదు.. అనే మూడు నిబంధనలను గుర్తుచేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణనలో చివరి రెండు అంశాలకు సంబంధించిన వివరాలు లభ్యం కానున్నాయి. డెడికేటెడ్ కమిషన్ ద్వారానే బీసీ రిజర్వేషన్ ఖరారు చేయాలన్న సుప్రీంకోర్టు నిబంధనను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 9వ తేదీన జారీ చేసిన జీవోలో ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నది.
దీంతో కొత్తగా నియామకమైన బీసీ కమిషన్ సుప్రీంకోర్టు నిబంధనల మేరకు ఏర్పడిన ‘డెడికేటెడ్ కమిషన్’గానే చెలామణి అవుతున్నది. సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు గతంలో వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న స్టేట్ బీసీ కమిషన్ ‘డెడికేటెడ్ కమిషన్’ అని బీసీ సంఘాలు సైతం ఆ జీవో (నెం.47)ను ఉదహరిస్తూ పేర్కొన్నాయి. బీసీల రిజర్వేషన్‌ను ఖరారు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బీసీ కమిషన్‌కు అప్పజెప్తూ జారీచేసిన ఉత్తర్వులను పిటిషన్‌లో ఆర్.కృష్ణయ్య తప్పుపట్టారు. తదుపరి విచారణలో ‘డెడికేటెడ్ కమిషన్’ అంశాన్ని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించనున్నారని సమాచారం.
హైకోర్టు ఉత్తర్వులతో సందేహాలు..
సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ‘డెడికేటెడ్ కమిషన్’ బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని చెప్పినందున ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్న స్టేట్ బీసీ కమిషన్ ఆ అధికారాలతో కూడినదేననే వాదనను వినిపించనున్నది. హైకోర్టు సంతృప్తి చెందని పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపైనా చర్చ జరుగుతున్నది. హైకోర్టు ఎలాంటి తుది తీర్పు ఇచ్చినా బీసీ రిజర్వేషన్లకు కులగణన ప్రక్రియకు నేరుగా సంబంధం లేనందున యథావిధిగా 6న ప్రారంభమవుతుందని అధికార వర్గాలు నొక్కిచెప్పాయి. గ్రామ పంచాయతీల పదవీకాలం ఫిబ్రవరిలోనే పూర్తికావడంతో వెంటనే కొత్త పాలకవర్గాలు కొలువుతీరాల్సి ఉన్నది. కానీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడం, లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగింది. వీలైనంత తొందరగా ముగించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుట్టింది. ఆ ప్రక్రియ పూర్తికాకుండా బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం లేకపోవడంతో హైకోర్టు తాజా ఉత్తర్వులు ఇంకెంత ఆలస్యానికి కారణమవుతాయోనన్న సందేహాలు మొదలయ్యాయి.