రూ. కోటి విలువైన నాలో ఆక్రమణ..లేఔట్ మాప్‌లో రోడ్డుగా చిత్రీకరణ

by Aamani |
రూ. కోటి విలువైన నాలో ఆక్రమణ..లేఔట్ మాప్‌లో రోడ్డుగా చిత్రీకరణ
X

దిశ,జహీరాబాద్: ఆక్రమణకు గురవుతున్న నాలా(వాగు)ను రక్షించాలని మొగుడంపల్లి మండలం మాడ్ది గ్రామస్థులు ఆర్డీవో కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. గ్రామానికి చెందిన సర్వే నెం. 60 , 78 ల మధ్య 33 అడుగుల వెడల్పుతో నాలా ఉంది. ఈ ప్రభుత్వ భూమిని సర్వే నెం.78 లోని భూమి పట్టాదారు ఆక్రమించి తన రియల్ వ్యాపారానికి వినియోగిస్తున్నారు. రూ.1 కోటికి పైనే విలువచేసే నాలా అక్రమించి తన భూమిలో లేఔట్ వేసేందుకు వ్యవసాయేతర భూమిగా మార్చుటకు ఆర్డిఓ అనుమతి కోరినట్లు తెలిందని పేర్కొన్నారు.

ఆ లేఔట్ లో ప్రభుత్వ నాలాను రోడ్డుగా మార్కింగ్ చేస్తూ చూపించారన్నారు.ఈ నాలాలో రోడ్డు వేయడం వలన నాలా మూసుకుపోయి వర్షాకాలంలో వచ్చే నీటి ప్రవాహానికి అడ్డంగా మారనుందన్నారు. దీంతో నాలలో ప్రవహించే వర్షపు నీరు చుట్టుపక్కలున్న పట్టా భూముల్లో నిలిచి పంట నష్టం వాటిల్లడమే కాకుండా అంతర్ రాష్ట్ర రహదారి(ఎన్ హెచ్-65 నుంచి కర్ణాటక చించోలి) కూడా ధ్వంసం అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కావున పరిశీలించి నాలా ఆక్రమించి లేఔట్ చేసిన రియల్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాలా కన్వర్షన్ (ఎన్ ఏ) అనుమతించరాదని కోరారు.

Advertisement

Next Story