దాహం తీర్చండి సారు.... అల్లాడుతున్న గ్రామ ప్రజలు

by Disha Web Desk 22 |
దాహం తీర్చండి సారు.... అల్లాడుతున్న గ్రామ ప్రజలు
X

దిశ, అల్లాదుర్గం: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం సీతా నగర్ గ్రామ పంచాయతీలోని ఆవాస గ్రామమైన తండాలో మంచి నీళ్ల ఎద్దడి తీవ్ర రూపం దాల్చిందని, గుక్కెడు మంచి నీళ్ళ కోసం తండా వాసులు పడరాని పాట్లు పడుతున్నారని బీజేపీ జిల్లా నాయకులు, అల్లాదుర్గం అసెంబ్లీ సాధన కమిటీ అధ్యక్షులు బ్రహ్మం అన్నారు. గురువారం సీతా నగర్ తండాను ఆయన సందర్శించారు. తండా వాసులు మంచి నీటి కోసం పడుతున్న ఇబ్బందులను గ్రహించారు. ఈ సందర్భంగా మంచి నీటి సమస్య తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… గత నెల రోజుల నుంచి నీళ్లు సరఫరా కాకపోవడం ఏంటని ప్రశ్నించారు. మిషన్ భగీరథ ట్యాంక్ ఉన్నప్పటికీ దాని ద్వారా చుక్క నీరు అందడం లేదని, గ్రామస్థులు తెలిపారు. 250 జనాభా గల తండా పట్ల క్షేత్రస్థాయి అధికారులు సరైన ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపించారు. వ్యవసాయ బోరు బావుల నుంచి త్రాగునీరు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి మిషన్ భగీరథ పథకం ద్వారా అందిస్తున్న త్రాగు నీరు ఎక్కడికి మళ్లిస్తున్నారని ప్రశ్నించారు.

గ్రామాల్లో భగీరథ నీళ్లు అందిస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదని అన్నారు. కొందరి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దీనిపై ఉన్నతాధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా భగీరథ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడక పోవడం తో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. తండా వాసుల దాహార్తిని తీర్చి త్రాగునీరు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ శంకర్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్, సంతోష్ తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed