అభివృద్ధికి ప్రతీకగా పటాన్ చెరు..

by Naresh N |
అభివృద్ధికి ప్రతీకగా పటాన్ చెరు..
X

దిశ, పటాన్ చెరు: ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పటాన్ చెరు నియోజకవర్గం నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధికి, సంక్షేమానికి ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, జీవో 58, 59 లబ్ధిదారలకు పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా, మినీ ఇండియాగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గం గత పదేళ్లలో ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. ఎమ్మెల్యే, ప్రజల కోరిక మేరకు నియోజకవర్గంలో కొత్తగా మూడు మున్సిపాలిటీలు, రెండు మండలాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆర్డీవో, కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేశామని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా మూడు మున్సిపాలిటీలకు 55 కోట్ల రూపాయల చొప్పున 165 కోట్ల రూపాయలు, మూడు డివిజన్లకు 30 కోట్లు, 55 గ్రామపంచాయతీలకు 35 లక్షల రూపాయల చొప్పున నిధులు విడుదల చేసి వాటి అభివృద్ధికి పునాది వేశామని తెలిపారు.




రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో పటాన్ చెరు ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డిని మూడోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పటాన్ చెరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పటాన్ చెరు అభివృద్ధికి వేలకోట్ల రూపాయలు మంజూరు చేస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed