నల్లవాగు ఆక్రమణ.. బరితెగించిన శిల్ప వెంచర్

by Aamani |
నల్లవాగు ఆక్రమణ.. బరితెగించిన శిల్ప వెంచర్
X

దిశ, సంగారెడ్డి: సదాశివపేట మండల పరిధిలోని 65వ జాతీయ రహదారికి ఆనుకుని నల్లవాగు పరివాహక ప్రాంతం ఉంది. సదాశివపేట మండల పరిధిలోని నాగ్సాన్ పల్లిలో నల్లవాగు సుమారు మూడు మీటర్ల వెడల్పుతో పారుతున్నది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడు మీటర్లు వెడల్పులో పారే వాగుకు రెండు పక్కల 3 మీటర్ల చొప్పున బఫర్ జోన్ ఉంటుంది. మూడు మీటర్ల పొడవు ఉండే వాగును కుదించి మీటరున్నరకే వాగు ప్రవాహం ఉండేలా శిల్ప వెంచర్ యాజమాన్యం ప్లాట్లు కొనుగోలు దారులను మాయ చేస్తూ రాతి కట్టడం నిర్మించారు. ఆ వాగు పక్కనే ఆక్రమణలు కనిపించకుండా పార్కులను ఏర్పాటు చేసి కలరింగిచ్చారు. బఫర్ జోన్ ను కాపాడాల్సిన ఇరిగేషన్ అధికారులు వాగును కబ్జా చేసి పార్కులు ఏర్పాటు చేసిన చూసీచూడనట్టుగా వదిలేయడం పలు విమర్శలకు తావిస్తోంది. కిలోమీటర్ మేర వాగు కబ్జా చేసి వెంచర్ ఏర్పాటు చేయడంతో పాటు వాగు ఆక్రమణ కనిపించకుండా వెంచర్ యాజమాన్యం చేస్తుంటే కాపాడాల్సిన ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారు.

వాగు ఆక్రమణ కనిపించకుండా పార్కులతో మాయా..

శిల్ప వెంచర్ నాగ్సాన్ పల్లి గ్రామ శివారులోని నల్ల వాగును ఆక్రమించారు. వాగును ఆక్రమించినట్లు తెలియకుండా కుదించిన వాగుకు రాతి కట్టడం కట్టి మాయ చేస్తున్నారు. నాగ్సాన్ పల్లి గ్రామశివారులో దాదాపు రెండు కిలోమీటర్లు దూరం పారే నల్లవాగును వెంచర్ యాజమాన్యం పార్కులు ఏర్పాటు చేసి బఫర్ జోన్ కనిపించకుండా మాయం చేశారు. గ్రామ పరిధిలో వాగులా కనిపించే నల్లవాగు వెంచర్లో ప్రవేశించగానే చిన్నగా రాతికట్టడంతో కుదించారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల సమాచారం మేరకు ఒక వాగు ప్రవాహాన్ని బట్టీ వెడల్పు ఉంటుందని, 3 మీటర్లు వెడల్పులో పారే వాగుకు రెండు పక్కల 3 మీటర్ల చొప్పున బఫర్ జోన్ ఉంటుందని వివరించారు. అలాగే 3 మీటర్ల కన్నా ఎక్కువ పరిమాణంలో పారే వాగుకు రెండు పక్కల బఫర్ జోన్ ఉండాలనే నిబంధనలు ఉన్నాయి.

వెంచర్ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు, ఎన్ఓసీ ఉన్నవి లేనివి ఆయా శాఖల అధికారులకే తెలియాలి. కానీ శిల్ప వెంచర్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వెంచర్ చేసి అమాయక ప్రజలకు ప్లాట్లు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతన్నది. అంతే కాకుండా మధ్యలో బ్రిడ్జి నిర్మాణం చేసి అటు పక్కన ప్లాట్లకు వెళ్లేందుకు రోడ్డు మార్గం చేశారు. భవిష్యత్తులో వాగు ఉధృతి పెరిగితే సమీప ఇండ్లలోకి వరద నీళ్లు రావడం తప్పనిసరి. ఇది గమనించని విక్రయ దారులు తమ వద్ద ఉన్న డబ్బులతో ప్లాట్ కొనే ఆలోచనతోనే వెంచర్లకు ప్రతి ఆదివారం పరుగులు తీస్తూ బుట్టలో పడిపోతున్నారు.

బఫర్ జోన్ లో నిర్మాణాలు...

బఫర్ జోన్ ను కాపాడవల్సిన అధికారులు వాగును కబ్జా చేసి పార్కులు ఏర్పాటు చేసిన చూసీ చూడనట్టుగా వదిలేయడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ వెంచర్ యాజమాన్యం దాదాపు 160 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అందులో 130 ఎకరాల వరకు వెంచర్ చేసి ప్లాట్లు అమ్ముతున్నారు. నల్ల వాగును ఆక్రమించడమే కాకుండా ఆహ్లాదం కోసం తాము నిర్మించామని చెబుతూ ప్లాట్లు విక్రయిస్తున్నారు. మూడు మీటర్ల వెడల్పున్న వాగును మీటరున్నర కుదించి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాగును ఆక్రమించినా ఇరిగేషన్ అధికారులు గానీ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. వాగును ఆక్రమించుకోవడం వల్ల చుట్టుపక్కల పంట పొలాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చి వాగు పొంగడం వల్ల తమ పంట పొలాల్లోకి నీరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా ప్రతినిధులు, అధికారులు అండదండలు పుష్కలంగా ఉండటంతో వెంచర్ యజమానులు బఫర్ జోన్ లో నిర్మాణాలు, ప్లాట్లు చేస్తూ విక్రయాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నీటి వనరులను కాపాడుతున్న హైడ్రా సంగారెడ్డి జిల్లాపై కూడా దృష్టి సారించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. నాగ్సాన్ పల్లిలోనే కాకుండా కంది మండలం, సంగారెడ్డి మండలం, సంగారెడ్డి పట్టణంలో కూడా చెరువులు కబ్జాలకు గురయ్యాయి. వీటిపై హైడ్రా దృష్టి సారిస్తే విలువైన నీటి వనరులను కాపాడుకునే వీలవుతుంది. ఆక్రమణలు ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed