ఎమ్మెల్సీ కవితబెయిల్‌పై.. ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్

by Aamani |
ఎమ్మెల్సీ కవితబెయిల్‌పై.. ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు స్పందించారు. మద్యం కుంభకోణంలో మరో ముద్దాయికి బెయిల్ వచ్చింది. కవిత బెయిల్ కు బీజేపీకి సంబంధం ఏం ఉంటుంది. సుప్రీం కోర్టు బెయిల్ ఇస్తే కవిత బయటకు వచ్చింది తప్ప భారతీయ జనతా పార్టీకి బెయిల్ కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సిద్దిపేట లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ...వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ ప్రెసిడెంట్ అని చెప్పుకునే జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ లు బెయిల్ ప్రొసీజర్ అంటే తెలియకుండా బీజేపీ పై బురద జల్లేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సిగ్వీ బెయిల్ ప్రొసీజర్ గురించి అర్థం అయ్యేలా ఆ నాయకులకు చెప్పాలని సూచించారు. అబద్దాల పునాదులే ఎజెండాగా ఎదిగిన కాంగ్రెస్ పార్టీ ఇంత కంటే గొప్పగా మాట్లాడుతారని ఆశించడం లేదన్నారు.

ఢిల్లీ ఉప ముఖ్య మంత్రి ఇండియా కూటమిలో భాగస్వామి మనీష్ సిసోడియా కు, జార్ఖండ్ మాజీ సీఎం కు బెయిల్ వచ్చిన సమయంలో మాట్లాడని కాంగ్రెస్ నాయకులు కవితకు బెయిల్ రాగానే మోకాలికి బోడి గుండుకు లింక్ పెట్టి మాట్లాడే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మానుకోవాలని హితవుపలికారు. కవిత బెయిల్ కోసం అభిషేక్ మను సిగ్వీ, ముకుల్ రోహిత్, కపిల్ సిబాల్ వాదనలు వినిపించారని వీరు అంతా ఏ పార్టీ నుంచి రాజ్య సభ్యులు అని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ ఏ పార్టీని విలీనం చేసుకోవడానికి సిద్దంగా లేదు.. నాకు తెలిసిన వరకు ఎవరు చర్చలు జరపలేదని ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. ముస్లిం మహిళలకు మనోవర్తి ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబితే ఆడర్ ను తుంగలో తొక్కి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన పెద్ద మనిషీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం, కోర్టులు, పార్లమెంట్ , సెబీల పై విశ్వాసం లేదన్నారు.

Advertisement

Next Story