తప్పు దోవ పట్టిస్తే చర్యలు తప్పవు.. మంత్రి కొండా సురేఖ

by Sumithra |
తప్పు దోవ పట్టిస్తే చర్యలు తప్పవు.. మంత్రి కొండా సురేఖ
X

దిశ, సిద్ధిపేట ప్రతినిధి : తప్పు చేస్తే చర్యలు తప్పవని జిల్లా అధికారులను మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. సమీక్ష సమావేశాలకు అధికారులు పూర్తి సమాచారంతో రావాలని, తప్పు దోవ పట్టిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల పై సిద్దిపేట కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఇంఛార్జి మంత్రి దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, కవంపల్లి సత్యనారాయణ, పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, వంటేరు యాదవ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అధికారులు అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. నిర్దిష్ట కాల పరిమితిలో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అర్హులైన రైతులు అందరికీ 2 లక్షల రుణ మాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెండు లక్షల పైన రుణాలు ఉన్న రైతులు మిగిలిన డబ్బులు చెల్లిస్తే వారి రుణాలు సైతం మాఫీ అయ్యే విధంగా వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. గతంలో రైతులకు వ్యవసాయ పరికరాలు అందించేందుకు కేంద్రం అందించిన నిధులు పక్కదారి పట్టాయని, అలా కాకుండా ఆ నిధులు రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జిల్లాలో పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య ఎందుకు తగ్గిందో వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు తయారు చేయాలని ఆదేశించారు. జిల్లాకు జీలుగు తక్కువ పరిమానంలో రావడం పై సంబంధిత శాఖ అధికారి పై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాకు రెగ్యులర్ జిల్లా వ్యవసాయ అధికారిని నియమించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ అందిస్తామన్నారు. జిల్లాలో చేప పిల్లల పంపిణీ ఆలస్యం పై ఆరా తీసిన మంత్రి ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి అన్నారు. జిల్లాలో చేప పిల్లల ప్రొడక్షన్ యూనిట్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

మహాలక్ష్మి పథకం బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే విధంగా సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని డయాలసిస్ యూనిట్లు అవసరం ఉంటే ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని పక్షంలో చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో తక్కువ పనితీరు ఉన్న శాఖల పై ప్రత్యేక దృష్టి సారించి సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ను ఆదేశించారు. అంతకుముందు గ్రామ పంచాయతీ నిధులు విడుదల, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం, మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి పనులకు నిధులు తదితర అంశాలను ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా విడుదలకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమీక్షలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి పలు సమస్యలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed