- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట.. ఏడాదిలో రూ.55 వేల కోట్లు ఖర్చు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్నది. ఎన్నికలకు ముందు వరంగల్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే రైతు ప్రభుత్వమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర సర్కారు ఏడాది కాలంలో కర్షకుల సంక్షేమానికి రూ.55 వేల కోట్లను వెచ్చించింది. ఇందులో అత్యధిక పథకాలు నేరుగా ఆర్థికంగా లబ్ధి చేకూర్చేవి కావడం విశేషం. ఆర్థికంగా సర్కారుకు ఇబ్బందులున్నప్పటికీ నెల రోజుల వ్యవధిలోనే 22.22 లక్షల మందికి రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసి సరికొత్త రికార్డు సాధించింది. ‘మాఫీ’ని పూర్తిస్థాయిలో చేయడానికి కసరత్తు చేస్తోంది. సన్న వడ్ల కొనుగోలు చేస్తూ రూ.500 బోనస్‌ను ఇస్తుండటంతో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి సలహాలు, సూచనల కోసం అనుభవజ్ఞడు కోదండరెడ్డి సారథ్యంలో వ్యవసాయ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ర్టవ్యాప్తంగా ‘రైతు పండుగ’ను నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
వరి సాగు విస్తీర్ణంలో దేశంలో తెలంగాణ నం.1
దేశంలోనే వరిసాగు విస్తీర్ణంలో తెలంగాణ నం.1 స్థానాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ పవర్‌లోకి రాగానే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ‘మాఫీ’ విషయమై ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఒకే సారి రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసింది. ఈ ఏడాదిలో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తుకు రూ.10,444 కోట్లు సబ్సిడీగా చెల్లించింది. రాష్ట్రంలో 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అదే విధంగా రైతు బంధు పథకానికి రూ.7,625 కోట్లు వెచ్చించింది. ప్రకృతి విపత్తులతో, క్రిమికీటకాలతో పంటలు నష్టపోతే రైతులు ఇబ్బంది పడకుండా.. నష్ట పరిహారం అందేలా పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించింది. రైతులు ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల బీమా పరిహారం ఆ బాధిత కుటుంబానికి అందిస్తోంది. జీవిత బీమా కంపెనీకి రైతు బీమా పథకం ప్రీమియంగా రూ.1,455 కోట్లు చెల్లించింది. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను కట్టుదిట్టంగా నిర్వహించింది. గతంలో కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు నెలకొల్పింది. రాష్ట్రంలో దాదాపు 9 లక్షల మంది రైతుల నుంచి రూ.10,547 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది.
పామాయిల్ సాగుపై మంత్రి తుమ్మల దృష్టి
బీఆర్ఎస్ పాలనలో నిర్వీర్యమైన వ్యవసాయ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ సర్కారు కృషి చేస్తోంది. గత ప్రభుత్వం ఎత్తివేసిన పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించి రైతుల తరఫున బీమా ప్రీమియం చెల్లింపులకు రూ.1,300 కోట్లు కేటాయించింది. రైతు బీమాను కొనసాగించేందుకు కావాల్సిన నిధులను కేటాయించింది. జీవిత బీమా కంపెనీకి ప్రీమియంగా రూ.1,455 కోట్లు చెల్లించింది. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు, ఆఫీసర్లు నేరుగా క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకునేందుకు ‘రైతు నేస్తం’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. అన్ని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను అమర్చనుంది. తొలి విడతగా 110 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2,601 రైతు వేదికల నుంచి రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే ఏర్పాట్లు చేసింది. రైతులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు పామాయిల్ సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. వ్యవసాయ అధికారులు రైతులలో చర్చించి పామాయిల్ సాగు చేయిస్తున్నారు. లక్ష ఎకరాలలో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ టార్గెట్ అధిగమించి రాష్ర్టవ్యాప్తంగా 2 లక్షల ఎకరాలలో పామాయిల్ సాగు అయ్యేలా చేశారు.