EX minister Harish Rao : కాళేశ్వరం కూలి పోతే.. రంగనాయక సాగర్ లోకి నీళ్లు ఎలా వచ్చాయి..?

by Sumithra |
EX minister Harish Rao : కాళేశ్వరం కూలి పోతే.. రంగనాయక సాగర్ లోకి నీళ్లు ఎలా వచ్చాయి..?
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మేడిగడ్డలో రెండు పిల్లర్స్ కూలి పోతే కాళేశ్వరం మొత్తం కూలి పోయిందన్నారు... అలా అయితే రంగనాయక సాగర్ లోకి నీళ్లు ఎలా వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 229 మందికి రూ.56 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే హరీష్ రావు లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారన్నారు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ తీపి అయింది.. తెలంగాణ చేదు అయ్యిందా అన్నారు. ఆరు గ్యారంటీల పేరిట మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు.

పెన్షన్ రాక అవ్వ తాతలు.. రైతు బంధు రాక రైతులు అరిగోస పడుతున్నారన్నారు. ఆడబిడ్డల పెళ్లికి లక్ష రూపాయలు తులం బంగారం అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే తులం బంగారం తుస్ మనిపించారని ఎద్దేవా చేశారు. ఇచ్చే లక్ష రూపాయలు సైతం 8 నెలలుగా ఇవ్వడం లేదన్నారు. పెన్షన్ 4 వేలకు.. రైతు భరోసా 7500 లకు పెంచుతామని, మహిళలకు రూ.2500 ఇస్తామని గొప్పలు చెప్పి మోసం చేశారన్నారు. బెల్టు షాపులు లేకుండా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు నేడు గల్లీ గల్లీలో బెల్ట్ షాప్ లు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. పాలు ఏందో నీళ్లు ఏందో ప్రజలు చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు అని చెప్పి 9 నెలల కాలంలో 20 వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చారన్నారు. సిద్దిపేట ప్రతిష్ఠ గౌరవం తెచ్చేలా అభివృద్ధి చేసుకున్నట్లు హరీష్ రావు స్పష్టం చేశారు.

Advertisement

Next Story