BC Commission Chairman : జనాభా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు

by Sridhar Babu |
BC Commission Chairman : జనాభా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు
X

దిశ, సంగారెడ్డి : జనాభా దమాషా ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ (Telangana BC Commission Chairman Niranjan)వెల్లడించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశంపై బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ బీసీ కులాల రాజకీయ, ఆర్థిక సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు కల్పించనున్నట్లు చెప్పారు. పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుందని, ఈ నెల 28 నుంచి ప్రారంభమైన బహిరంగ విచారణలో ఆదిలాబాద్, కరీంనగర్, సంగారెడ్డిలో ప్రజాభిప్రాయ సేకరణ చేశామన్నారు.

స్థానిక సంస్థలకు జనవరి నెలలో కాలపరిమితి ముగిసిందని, దీంతో కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన 2 నుంచి 3 వేల కోట్ల రూపాయల నిధులు ఆగిపోయాయన్నారు. వీటి ద్వారా గ్రామపంచాయతీల మనుగడ కష్టంగా మారిందన్నారు. పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బీసీ జనగణన (BC Census)ఆధారంగా నిర్వహించాలని నిర్ణయించారన్నారు. కానీ బీసీ కమిషన్ మాత్రం బీసీల కులగణన చేసిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రిని కోరగా ఆయన స్పందించి ఆయా వర్గాలకు కల్పించేందుకు రిజర్వేషన్లపై అధ్యయనం కోసం బహిరంగ విచారణలు చేస్తుందన్నారు.

నవంబర్ 6,7 తేదీల్లో సమగ్ర కుటుంబ సర్వే..

రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేసేందుకు నవంబర్​ 6,7 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు చైర్మన్ నిరంజన్ తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్ ద్వారా కులగణన చేయడం జరుగుతుందని, ప్రజలు తమ ఇళ్ల వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు సమగ్రంగా వివరాలు అందించాలన్నారు. ఈ వివరాల ఆధారంగా ఏ కులం జనాభా ఎంత, వారికి రిజర్వేషన్లు ఏ శాతం కల్పించాలనే దానిపై పూర్తిగా స్పష్టత వస్తుందన్నారు.

కులాల జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఎవ్వరూ కూడా తమ వివరాలు దాచుకోకుండా సర్వేలో తెలపాలని సూచించారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, బీసీ సంక్షేమశాఖ అధికారి జగదీష్, వివిధ బీసీ కులాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed