ఘనంగా కొండపోచమ్మ జాతర.. భక్తుల కిటకిట

by Disha daily Web Desk |
ఘనంగా కొండపోచమ్మ జాతర.. భక్తుల కిటకిట
X

దిశ, జగదేవపూర్: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ సమీపంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండ పోచమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు సోమవారం నుండి ప్రారంభం అయ్యాయి. ఈ జాతర ఉత్సవాలు సంక్రాంతికి ప్రారంభమై మూడు నెలలపాటు కొనసాగనున్నాయి. ఆదివారం ఉదయం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తులు సాయంత్రం పొద్దు పోయే వరకు కొండపోచమ్మకు చేరుకున్నారు. సోమవారం ఉదయం నుండే కొండపోచమ్మ ఆలయ పరిసరాలు భక్తుల రాకతో జనసంద్రంగా మారాయి. అమ్మవారికి కొత్తకుండలో నైవేద్యం వండి డప్పు చప్పుళ్లు మధ్య పోతురాజుల విన్యాసాలతో మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకొని అమ్మవారి సన్నిధికి చేరుకొని ఒడి బియ్యం పోసి మొక్కలు చెల్లించుకున్నారు. జాతర మొదటి రోజు కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో మోహన్ రెడ్డి అన్ని ఏర్పాట్లను చేశారు.

Advertisement

Next Story