KCR ఇలాకాలో అసలేం జరుగుతోంది.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా గజ్వేల్!

by Satheesh |   ( Updated:2023-02-13 05:37:24.0  )
KCR ఇలాకాలో అసలేం జరుగుతోంది.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా గజ్వేల్!
X

దిశ బ్యూరో, సంగారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా గజ్వేల్ బీఆర్ఎస్ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఇక్కడి రాజకీయంపై అన్ని వర్గాలు, పార్టీల్లో విస్త్రతంగా చర్చ జరుగుతుంది. గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ రాజమౌళిపై కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టడంతో అందరి దృష్టి గజ్వేల్‌పై పడింది. అవినీతి పరుడైన చైర్మన్ తమకు వద్దని, ఆయనతో అధికారులు ఇబ్బంది పడితూ సస్పెండ్ కావడంతో పాటు అభివృద్ధి కుంటుపడుతుందని కౌన్సిలర్లు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే? సొంత పార్టీ నేతలే అవినీతి జరుగుతుందని ఆరోపణలు చేయడం ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారింది.

ఇదే అదనుగా ప్రతిపక్షాలు గజ్వేల్‌పై నజర్ పెట్టాయి. ఇంత చేస్తున్నా..? కోట్లాది రూపాయలు పట్టణ అభివృద్ది కోసం కేటాయిస్తున్నప్పటికీ ప్రజా ప్రతినిధులు ఇంకా అసంతృప్తితో ఉండడాన్ని సీఎం కేసీఆర్ కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఇంకా ఏం చేయాలి..? ఇదేనా పద్దతి అంటూ ఆగ్రహిస్తున్నట్లు సమాచారం. అయితే తాము పార్టీకి విధేయులమేనని, కేవలం అవినీతి పరుడైన చైర్మన్ పైనే తమ ఆగ్రహమని కౌన్సిలర్లు మండిపడుతున్నారు. చైర్మన్ ను ఎట్టి పరిస్థితుల్లో దింపేయాల్సిందేనని పట్టుబట్టి కూర్చున్నారు.ఈ నేపథ్యంలో ఇంటలీజెన్స్ నివేదికల ఆదారంగా గజ్వేల్ లో చైర్మన్ అవినీతిపై విచారణ జరిపిస్తున్నట్లు కూడా సమాచారం.

అభివృద్దికి కోట్లు కేటాయిస్తున్నప్పటికీ..

గజ్వేల్ మున్సిపాలిటీ అభివృద్ది కోసం కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తున్నది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజవకర్గం కేంద్రం కావడంతో నిధులకు కొదవ లేదని చెప్పొచ్చు. గజ్వేల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులున్నాయి. ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ తో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందారు. చైర్మన్ గా రాజమౌళి ఎన్నిక అయినప్పటి నుంచి పార్టీలో నాయకులు, కార్యకర్తల నుంచి నిరసన, అసంతృప్తి వ్యక్తం అయ్యింది.

అందరూ ఊహించినట్లుగానే మున్సిపాలిటీలో అవినీతి పెరిగిందని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదని, ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఓ కౌన్సిలర్ చెప్పుకొచ్చారు. గతంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు కు భయపడి పనిచేసే వారని, ఇప్పటి చైర్మన్ మాత్రం తనకెవరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. వందల కోట్లు వస్తున్నా..కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేయడంతో కేవలం చైర్మన్ అవినీతి వ్యవహారమే ఉన్నదని చెబుతున్నారు.

కుటుంబ సభ్యుల ప్రమేయంతో..

గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా మున్సిపాలిటీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని కౌన్సిలర్లు, పట్టణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండే కొందరు రోజువారిగా మున్సిపాలిటీలో ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ఎవరు, ఎక్కడ ఇళ్లు నిర్మిస్తున్నారు..? ఇంకా ఎలాంటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పర్యవేక్షిస్తుంటారని కౌన్సిలర్లు చెబుతున్నారు. ఇంటి నిర్మాణం జరుగుతుంటే ఆ విషయాన్ని చైర్మన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తారని, అక్కడి నుంచి వసూళ్ల పర్వం కొనసాగుతుందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అనుమతులు లేవంటూ ఓ నిర్మాణాన్ని దగ్గరుండి కొంత కూల్చి వేయించారని, ఏం జరిగిందో ఏమో కానీ ఆ తరువాత అటు వైపు వెళ్లడం లేదని చెబుతున్నారు. ఛరిస్మా లేని వారికి పదవులు ఇచ్చారని, ఈ క్రమంలోనే గజ్వేల్ లో ఈ పరిస్థితి నెలకొన్నదని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు ప్రస్తుత పరిస్థితులపై కుండబద్దలు కొట్టారు.

గజ్వేల్ రాజకీయ పరిస్థితులపై సీఎం సీరియస్

గజ్వేల్ లో బీఆర్ఎస్ రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత చేస్తున్నా..గజ్వేల్ ను అభివృద్ధి చేయాల్సింది పోయి అవినీతి ఆరోపణలు చేసుకోవడంపై మండిపడుతునట్లు సమాచారం. గజ్వేల్ కు సీఎం కేసీఆర్ కోట్లు కేటాయిస్తున్నారని ఓ వైపు ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా స్థానిక నేతలు మాత్రం అసంతృప్తితో ఎందుకు ఉంటున్నారని సన్నిహితుల వద్ద చర్చించినట్లు తెలిసింది.

20 మంది కౌన్సిలర్లలో 14 మంది చైర్మన్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గజ్వేల్ లో ఏం జరుగుతుంది..? చైర్మన్ అవినీతి ఆరోపణలపై వాస్తవమెంత..? అనే అంశాలను ఇంటలీజెన్స్ నుంచి సమాచారం తీసుకుంటున్నట్లు తెలిసింది. అంతే కాకుండా నియోజకవర్గంలోని పలువురు పార్టీ ముఖ్య నాయకుల నుంచి కూడా గజ్వేల్ బీఆర్ఎస్ లీడర్ల రాజకీయంపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది.

చైర్మన్‌ను దింపే వరకు ఊరుకోం..

అవినీతి చైర్మన్ రాజమౌళిని కూర్చీ నుంచి దింపే వరకు తాము ఊరుకునే ప్రసక్తే లేదని కౌన్సిలర్లు పట్టుబడి కూర్చున్నారు. అవినీతి చైర్మన్ మాకొద్దని స్వయంగా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మాణాలు పత్రాలు అందించిన 14 మంది కౌన్సిలర్లు సిద్దిపేట కలెక్టరేట్ నుంచి నేరుగా క్యాంపుకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి మీడియాకు వీడియో రూపంలో సమాచారం కూడా అందించిన విషయం తెలిసిందే. పార్టీకి తాము విదేయులమేనని, చైర్మన్ అవినీతిని మాత్రం సహించలేకపోతున్నామని, అతను దిగిపోవాలని వెల్లడించారు. మొత్తం పూర్తి స్థాయిలో కౌన్సిలర్లు చైర్మన్ తీరుపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి హరీష్ గజ్వేల్ అభివృద్దికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంటే మున్సిపల్ చైర్మన్ మాత్రం అవినీతికి పాల్పడుతూ అభివృద్ధిని ఆగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన దిగిపోతేనే గజ్వేల్ మున్సిపాలిటీ బాగుపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అధిష్టానం ఏ విదంగా స్పంధించనున్నది..? చైర్మన్ దిగిపోతారా..? అధిష్టాన పెద్దలు కౌన్సిలర్లకు నచ్చజెబుతారా..? ఇలా సవాలక్ష ప్రశ్నలు రాజకీయ పార్టీల నుంచి వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి : పార్టీ విస్తరణకు కేసీఆర్ 'స్థానిక' వ్యూహం..

Advertisement

Next Story

Most Viewed