ఇంటి పన్ను కట్టలేదా.. అయితే మీరు చీకట్లో ఉండాల్సిందే.. లక్ష్మీపతి గూడెంలో కొత్త రూల్!

by Satheesh |   ( Updated:2023-02-10 04:02:30.0  )
ఇంటి పన్ను కట్టలేదా.. అయితే మీరు చీకట్లో ఉండాల్సిందే.. లక్ష్మీపతి గూడెంలో కొత్త రూల్!
X

దిశ బ్యూరో, సంగారెడ్డి: ఇంటి పన్ను కట్టలేదా అయితే మీరు చీకట్లో రోజులు గడపాల్సిందే. తప్పదు మరి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని లక్ష్మీపతి గూడెంలో ఇదే రూల్ కొనసాగుతున్నది. ఇంటి పన్ను కట్టకపోతే కరెంట్ కట్ చేసుకున్నా తమకు సంబంధం లేదని గ్రామ పంచాయతీలో సభ్యులు తీర్మానం చేసుకున్నారట. ఇంకేముంది.. ఇదే తీర్మాణాన్ని ముందు పెట్టి పంచాయతీ, విద్యుత్ శాఖ సిబ్బంది కలిసి ఉన్నఫలంగా బకాయిలు పడ్డ ఇండ్ల కరెంట్ వైర్లు కత్తిరించారు. ఇందులో వార్డు సభ్యురాలి ఇళ్లు కూడా ఉండడం గమనార్హం.

లక్ష్మీపతి గూడెం..గరం.. గరం

పంచాయతీ అధికారులతో కలిసి విద్యుత్ శాఖ సిబ్బంది ఇంటి పన్ను బకాయి ఉన్న వారి కరెంట్ కట్ చేయడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పన్ను కూడా కేవలం ఈ ఏడాదికి సంబంధించిన తక్కువే ఉన్నదని, అయినా అవేవి పట్టించుకోకుండా కరెంట్ సరఫరా నిలిపివేయడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకోకుండా పంచాయతీ సభ్యులు తీర్మానం చేసినంత మాత్రానా కరెంట్ నిలిపివేస్తారా..? అని మండి పడుతున్నారు. చాలా వరకు పేదలే ఉన్నారని, కనీసం చాటింపు కూడా లేకుండా ఇంటి పన్ను చెల్లించలేదని కరెంట్ సరఫరా నిలిపివేయడం ఎంత వరకు సమంజసమని అధికారులను ప్రశ్నిస్తున్నారు.

తీర్మానం చేశారు.. చీకట్లో ఉన్నారు..

ఇంటి పన్ను చెల్లించని ఎవరి ఇంటికైనా విద్యుత్ సరఫరా నిలిపివేయాలని గ్రామ పంచాయతీలో సభ్యులు తీర్మానించుకుంన్నారు. ఈ తీర్మాణంలో వార్డు సభ్యురాలు వీరన్నల అరుణ కూడా ఉన్నారు. తీర్మాణంలో సంతకం చేసిన ఆమె ఇంటిమీద కూడా పన్ను బకాయి ఉన్నది. దీనితో అందరితో పాటుగా విద్యుత్ శాఖ సిబ్బంది వార్డు సభ్యురాలి విద్యుత్ కనెక్షన్ కూడా కత్తిరించారు. ఈ వ్యవహారం గ్రామంలో తీవ్ర అందోళనకు దారితీయగా, జిల్లా వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

ఇవి కూడా చదవండి : CM కేసీఆర్ సొంత ఇలాకాలో భగ్గుమన్న అసమ్మతి.. కీలక నిర్ణయం తీసుకున్న గజ్వేల్ కౌన్సిలర్లు!

Advertisement

Next Story

Most Viewed