కమీషన్లు తీసుకున్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి : కేంద్రమంత్రి Smriti Irani

by Naresh |   ( Updated:2023-10-20 13:11:44.0  )
కమీషన్లు తీసుకున్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి : కేంద్రమంత్రి Smriti Irani
X

దిశ, దుబ్బాక: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామాకాలను కేసీఆర్ కుటుంబం దోచుకుందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఎమ్మెల్యే మాధవనేని రావు సమక్షంలో శుక్రవారం దుబ్బాకలో నిర్వహించిన నారీ శక్తి వందన్ రఘునందన్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. స్వరాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామాకాల కోసం కోట్లాడే పరిస్థితి నెలకొందన్నారు. రూ. 40 వేల కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు రూ. లక్ష కోట్లకు పెంచి నిధులను దుర్వినియోగం చేశారని, మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రం పై రూ. 5 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని, కొలువులను నిరుద్యోగులకు ఇవ్వకుండా కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలు ఇప్పించుకున్నాడని ఆమె ఎద్దేవా చేశారు. రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడ్డ బీజేపీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట రాష్ట్రంలో 35 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 9 వేల కోట్ల నిధులను జమ జేసిందన్నారు. రాష్ట్రంలో జరిగిన అనేక అవినీతి, అక్రమాల్లో నేరుగా కేసీఆర్ కుటుంబం ఉందన్నారు. తెలంగాణ వస్తే ఎంతో చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒక్క పని చేయలేక మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ వైపు ఉండాలా, దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తోన్న మోడీ వైపు ఉండాలో ప్రజలు తెల్చుకోవాలని కోరారు. దళిత బంధు లాంటి ప్రభుత్వ పథకాల్లో 30 శాతం కమీషన్లు తీసుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ఆమె పిలుపు నిచ్చారు.

గల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కోట్లాడుకుంటాయని, ఢిల్లీలో మాత్రం చెట్టా పట్టాల్ వేసుకుని తిరుగుతున్నాయని, బీజేపీ ప్రభుత్వం రైలును తీసుకొచ్చి సిద్దిపేట ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని, అన్నదాతలకు యూరియా కొరత తీర్చడానికి రూ.6 వేల కోట్లను కేటాయించిందని, కోటి 13 లక్షల పేద ప్రజల కోసం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జన్ ధన్ ఖాతాలను తెరిచిందన్నారు. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ లాంటి పట్టణాలను స్మార్ట్ సిటీలను చేయడానికి వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల కోసం రూ. 23 వేల కోట్లను మోడీ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో 2500 కిలో మీటర్లకు పెంచి కొత్త నేషనల్ హైవేలకు రూపకల్పన చేశారన్నారు. టెక్స్‌టైల్ పార్క్, కరోనా వాక్సిన్, ఉచిత రేషన్ బియ్యం, సిద్దిపేటకు రైలు, నేషనల్ హైవే కావాలంటే మోడీ అవసరమని, ఎక్కడ చూసినా, ఏ స్కీమ్ చూసినా ఓటు కూడా మోడీకి వేయాలని కోరారు. రాష్ట్రంలో 64 లక్షల మందికి ముద్ర లోన్ ఇచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మోడీ ఇచ్చిన కరోనా వాక్సిన్ రాహుల్, కేసీఆర్ వేసుకున్నారని తెలిపారు. రాముని కోసం అయోధ్యలో మందిర్ నిర్మిస్తున్నది కూడా మోడీ అని గుర్తు చేశారు. ఆ రాముడిని గుర్తు చేసుకుని ఈ రఘునందనికి ఓటు వేసి కేసీఆర్‌కు సరైన బుద్ధి చెప్పాలని ఆమె పిలుపు నిచ్చారు. ప్రముఖ కవి, గాయకుడు అందెశ్రీ రాసిన జయహో తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా చేస్తామని చెప్పిన కేసీఆర్ మోసం చేశారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed