పేదల భూముల్లో ప్రభుత్వం లేఅవుట్లు.. రైతులకు ప్రతిపక్షాల అండ

by Sathputhe Rajesh |
పేదల భూముల్లో ప్రభుత్వం లేఅవుట్లు.. రైతులకు ప్రతిపక్షాల అండ
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: గ్రేటర్​ హైదరాబాద్​కు సమీపంలో ఉంటున్న గ్రామం అది. అంతా ప్రశాంతంగా ఉన్న ఆ ఊరిలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. పేదలు రోడ్ల మీదకు వస్తున్నారు. సర్కారే తమ పొట్టగొడుతుందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎప్పుడో 40 ఏండ్ల క్రితం సమైక్య సర్కారు ఇచ్చిన భూమిని ఇప్పడు తెలంగాణ సర్కారు లాక్కుంటున్నందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పేదలకు పంపిణీ చేసిన భూములను స్వాధీనం చేసుకుని లేఅవుట్లు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా భూ సేకరణ కోసం అధికారులు రైతులతో సమావేశాలు జరుపుతున్నారు. ఎకరం భూమికి 200 గజాల స్థలం ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. అయితే ఈ సర్కారు లేఅవుట్లపై అటు పేదలు, మరోవైపు ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇటీవల ఈ భూసేకరణ అంశంపైనే జనంలో చర్చ జరుగుతున్నది. సాగు చేసుకుని బతుకుమని ఇచ్చిన భూమిని సర్కారు ఎలా తిరిగి తీసుకుంటుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.

కన్నీళ్లు పెట్టుకుంటున్న ఐనోల్ రైతులు

పటాన్​చెరు మండలంలోని ఐనోల్​ గ్రామంలో దాదాపు 40 ఏండ్ల క్రితం ప్రభుత్వం 277 సర్వే నెంబర్ లో రైతులుకు 86 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. అప్పుడు పంపిణీ చేసిన ఆ భూమిలో స్థానిక రైతులు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. 80 శాతం భూమి సాగులో ఉన్నది. ఒక్క ఐనోల్​లే కాకుండా జిల్లా వ్యాప్తంగా గతంలో పేదలకు పంపిణీ చేసిన అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే కంది మండలంలోని ఆరుట్లలో పేదలకు గతంలో 130 ఎకరాలు పంపిణీ చేయగా వాటిని తిరిగి తీసుకోవడానికి ఇటీవలే అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. జిన్నారం మండలం జంగంపేట గ్రామంలో తమకు గతంలో ఇచ్చిన భూమిని తిరిగి తీసుకోవద్దని రైతులు తహసీల్దార్​కు వినతి పత్రం ఇచ్చారు. ఐనోల్​ పరిధిలో ప్రస్తుతం కోట్లలో భూముల ధరలు ఉన్నాయి. ఎకరం భూమి తీసుకుని కేవలం 200 గజాల స్థలం ఇవ్వడంలో అర్థం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఐనోల్​ అని కాకుండా జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థతి ఉందని పరిస్థితులు స్పష్టం చేస్తున్నారు. కాగా ఐనోల్​ అంశాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బీజీపీ నేత నందీశ్వర్​గౌడ్ గ్రామ రైతులతో మాట్లాడారు. తాను రైతుల పక్షాన అండగా ఉంటానని హామీ ఇచ్చి వెళ్లారు.

ఇదిలా ఉండగా కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​చార్జి కాట శ్రీనివాస్​గౌడ్ ​కూడా ఐనోల్​ రైతులను పరామర్శించారు. తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇలా ప్రతిపక్షాల నుంచి గ్రామ రైతులకు మద్దతు లభిస్తున్నది.

పేదలకు ఇచ్చిన భూములు ఎలా తీసుకుంటారు..?-రైతు నర్సింలు, ఐనోల్​

గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన ఈ భూమిలో పంటలు పండించుకుని బతుకున్నాం. ఈ భూమే లేకపోతే మా బతుకులు ఆగమైతాయ్​. ఈ భూమిలో పంటలు పండించుకునే తాము పిల్లలను చదివించుకుంటున్నాం. ఎప్పడో ఇచ్చిన భూములను ఇప్పడు సర్కారు తిరిగి తీసుకోవడం ఏమిటీ..? తాము భూములు సర్కారు ఇవ్వం. ఎకరం భూమి ఇస్తే 200 గజాల స్థలం ఇస్తారా..? ఇది ఎంత వరకు న్యాయం. 40ఏండ్లుగా ఏ సర్కారుకు మా భూములపై కన్ను లేదు. ఇప్పుడే ఎందుకు ఇలా..?

నువ్వుచ్చినవని భూమి తీసుకుంటవా..?-మహిళా రైతు డప్పు సుజాత

ఎప్పుడో ఎండ్ల క్రితం ఇచ్చిన భూమిని ఇప్పుడు ఎలా తీసుకుంటారు. మాకిచ్చిన భూమి తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గులేదా..? కమ్యూనిస్టులు, ఇంకా ఎవరో ఈ భూములు మా వాళ్లకు ఇచ్చారు. అలాంటి భూమిని ఈ సర్కారు గుంజుకుంటదా..? మాకు సర్కారు బాగా చేస్తుందని గెలిపించుకున్నాం. ఇలా చేస్తుందనుకోలే. మేము పంటలు పండించుకునే భూములు ఎలా గుంజుకుంటరు...?

రైతుల పక్షాన కోర్టులో కొట్లాడుతా- కాంగ్రెస్​ నేత కాట శ్రీనివాస్​ గౌడ్

ఎప్పుడో కాంగ్రెస్​ప్రభుత్వం ఉన్న సమయంలో ఇచ్చిన భూములను ప్రభుత్వం ఇప్పడు ఎలా స్వాధీనం చేసుకుంటుంది. ఇది ఎంత వరకు సమంజసం. 86 ఎకరాల భూమిని ఎందరో నిరుపేద రైతుల సాగుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారి నోట్లో మట్టి కొట్టి ప్రభుత్వం రియల్​ వ్యాపారం చేస్తుందా..? స్థానిక ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి రైతు వ్యతిరేకిగా మారిపోయాడు. ఆయనే రియల్​వ్యాపారం చేస్తున్నారు. ఐనోల్​లో రైతులకు కాంగ్రెస్ ​అండగా ఉంటుంది. పేదల భూములు కాపాడడం కోసం కోర్టులోనే కొట్లాడుతా..

ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది-మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్

కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఎప్పుడో పేదలకు ఇచ్చిన భూములను తిరిగి తీసుకొని లే అవుట్ చేయడానికి చూస్తున్నది. పంటలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న రైతుల నుంచి భూములు తీసుకొని రియల్ వ్యాపారం చేస్తారా..? ఇదెక్కడి న్యాయం..? అధికారులు బలవంతంగా భూములు ఇవ్వాలని రైతులను బెదిరిస్తున్నారు. బీజేపీ పక్షాన పేద రైతుల భూములను కాపాడడం కోసం ఉద్యమం చేస్తాం. దళిత రైతులకు మూడు ఎకరాలు ఇస్తామన్న కేసీఆర్ ఉన్న భూమిని లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Advertisement

Next Story