చివరి సమావేశంలో ఫలప్రద చర్చ.. ప్రజా సమస్యల పై ప్రస్తావన

by Aamani |
చివరి సమావేశంలో ఫలప్రద చర్చ.. ప్రజా సమస్యల పై ప్రస్తావన
X

దిశ,మెదక్ ప్రతినిధి : జడ్పీ చివరి సమావేశం అరుపులు, రాజకీయ ఎత్తిపొడుపు లు లేకుండా ప్రజా సమస్యలపై ఫలప్రద చర్చలతో సాగింది. జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ అధ్యక్షతన మెదక్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో జరిగింది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సంజీవ్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుభాష్ రెడ్డి, యాదవ రెడ్డి లు హాజరయ్యారు. నర్సింగి ఆరోగ్య కేంద్రంలో డెలివరీలు ఆగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, స్టాఫ్ కొరత కూడా కేంద్రంలో ఉందని జడ్పీటీసీ కృష్ణా రెడ్డి తెలిపారు. పల్లె దవాఖానకు కూడా ప్రారంభం కాలేదని ఎంపీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇద్దరు స్టాఫ్ నర్సుల ను నియమించాలని కోరారు. నర్సుల నియామకం ప్రక్రియ సాగుతుందని, త్వరలో ఏర్పాటు చేస్తామని జిల్లా వైద్యాధికారి చెప్పారు. నిజాంపేట పీహెచ్సీకి స్టల సేకరణ చేసి ప్రభుత్వం నుంచి రూ .1.5 కోట్లు మంజూరైన పనులు మాత్రం ఐదేళ్లుగా సాగడం లేదని జడ్పీటీసీ పంజా విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పదవీకాలం ముగింపుకు వచ్చిన పీ హెచ్ సి నిర్మాణం కాలేదని అన్నారు. జిల్లాల్లో చిలిపి చెడ్, నిజాంపేట లలో త్వరలో మొదలు పెడుతమని వైద్యాధికారి తెలిపారు.

నర్సింగి, జప్తి శివునూర్ లలో సబ్ సెంటర్ లు మంజూరైన ఏర్పాటు లో జాప్యం ఎందుకని జడ్పీటీసీ ప్రశ్నించారు. తూప్రాన్ బ్లడ్ యూనిట్ లో తగిన సిబ్బందిని నియమించాలని జడ్పీ చైర్ పర్సన్ కోరారు. మెదక్ లో డయాలసిస్ రోగుల కోసం ఏర్పాటు చేసిన కేంద్రం లో పారిశుధ్యం దారుణంగా ఉందని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి అన్నారు. పారిశుధ్యం, మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడం వల్ల డయాలసిస్ కు వచ్చే వారు మరింత రోగాల బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. డయాలసిస్ కేంద్రంలో కరెంట్ సమస్య కూడా ఉందని, డయాలసిస్ రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. విద్యుత్ తీగలు నేలకు తాకుతూ ప్రమాదకరంగా ఉన్నాయని చిలిపి చెడ్ ఎంపీపీ తెలిపారు. శివ్వంపేట మండలం లో వెంచర్ యాజమాన్యం పొలాల్లోకి వెళ్లకుండా దారి మూసి వేసి, రైతు పొలాలకు విద్యుత్ కట్ చేస్తే ఎందుకు చర్యలు తీసుకోడం లేని ఎమ్మెల్యే సునీతా రెడ్డి ప్రశ్నించారు.

రైతులకు ఇబ్బందులు పెడుతున్న వారి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని ట్రాన్స్ అధికారులు తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వరకు విద్యుత్ మెటీరియల్ డ్రా కావడం లేదని, ఎలా అయితే ఎలా విద్యుత్ సమస్యలు తీరుతాయని సునీతా రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్ డిడి లు చెల్లించిన కనెక్షన్ ఇవ్వడం లేదని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెద్ద శంకరం పేట లో విద్యుత్ అధికారి శంకర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, ఐరెన్ స్తంభాల వద్ద సిమెంట్ పోల్స్ వేయాలని చెప్పిన ఇప్పటివరకు వేయలేదని పెద్ద శంకరం పేట ఎంపీపీ తెలిపారు. మండల సర్వ సభ్య సమావేశాలకు సైతం వచ్చి సమస్యలు వినడం లేదన్నారు. వెంటనే శంకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బడుల్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు తెలిపారు. కొన్ని స్కూల్స్ వద్ద ఉన్న నిర్వహణ సక్రమంగా లేదని, మరి కొన్ని స్కూల్స్ లో మరుగుదొడ్లు లేవని అన్నారు. అమ్మబడి, మన ఊరు మన బడిలో నిర్మాణం చేస్తున్నామని, త్వరలో పూర్తి అవుతాయని కలెక్టర్ తెలిపారు. టాయిలెట్స్ నిర్వహణ కోసం స్కావెంజర్స్ ను తప్పని సరిగా నియమించాలని కోల్చారం ఎంపీపీ మంజుల కోరారు.

జొన్నల తూకం లో 8 కిలోల తరుగు ఎందుకు..? : సంజీవ రెడ్డి, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే

జొన్నలు, వరి తూకం లో తరుగు పేరుతో కిలోల కొద్ది కొల్లగొడుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. జొన్నలకు 8 కిలోలు, వరి తూకంలో నాలుగు కిలోలు తరుగు తీస్తున్నారని, వారి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారాలను కోరారు. విద్యుత్ డిడి లు చెల్లించిన వారికి స్థంబాల ఎస్టిమేషన్ లో అత్యధికంగా వేస్తున్నారని, లక్ష ఖర్చు అయ్యే చోట నాలుగు లక్షలు చూపిస్తూ రైతుల వద్ద దోచేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సిద్దిపేట కు విద్యుత్ మెటీరియల్ గోదాం తరలింపు నిలిపివేయాలి: సునీతా రెడ్డి

సంగారెడ్డి లో ఉన్న విద్యుత్ మెటీరియల్ గోదాం ను సిద్దిపేట కు తరలించి ఉత్తర్వులను నిలిపి వేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి మెదక్ జిల్లా ఏర్పాటు జరిగిన తర్వాత సంగారెడ్డి లో మెదక్ విద్యుత్ మెటీరియల్ గోదాం ఉందని, కానీ ఇప్పుడు సిద్దిపేట కు తరలించడం వల్ల ఇబ్బందులు వస్తాయని అన్నారు. అలాగే మెదక్ జిల్లా కేంద్రంలో గతంలో సేకరించిన స్థలం లో నూతన గోదాం నిర్మాణం చేపట్టాలని తీర్మానం చేశారు.

విద్యుత్ కోతలు జిల్లాలో లేవు: కలెక్టర్

విద్యుత్ కోతల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని సభ్యులు సభలో ప్రస్తావించగా ఇందుకు జిల్లా కలెక్టర్ స్పందించి మాట్లాడారు. జిల్లాలో ఎక్కడ విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు. గతంలో ఎంత విద్యుత్ వాడకం ఉండేదో ప్రస్తుతం కూడా అంటే ఉన్నట్టు ఆన్ లైన్ లో వివరాలు సేకరించినట్లు చెప్పారు. లోకల్ గా వచ్చే విద్యుత్ సంస్థలు, ఈదురు గాలుల వల్ల వచ్చే అంతరాయం మినహా విద్యుత్ కోతలు లేవన్నారు. ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఉత్పన్నం అయితే తన దృష్టికి తీసుకురావాలని, లేకపోతే టోల్ ఫ్రీ కి కాల్ చేయాలని చెప్పారు.

పైరవీలు చేసిన వారికే అంబులెన్స్...? : ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి

ప్రభుత్వ అంబులెన్స్ లీడర్ లు వచ్చి పైరవీ చేస్తేనే అందుబాటులోకి వస్తున్నాయని, లేకుంటే పేదలకు అంబులెన్స్ సేవలు అందడం లేదని సుభాష్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లాలో ఉన్న అంబులెన్స్ లు ఎందుకు అత్యవసర సమయంలో అందుబాటులో ఉండటం లేదని, అది కూడా నేతలు వచ్చి పైరవీ చేస్తేనే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల రోగుల కోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్ లు అందేలా జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని కోరారు. జిల్లాలో అవసరమైన అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే జిల్లాలో చాలా ఫెర్టిలైజర్ షాప్ ల్లో కల్తీ గడ్డి, ఇతర రసాయన ఎరువులు విక్రయిస్తున్నారని తెలిపారు. షాప్ ల వద్దకు వెళ్లి కొనుగోలు చేసిన రసాయనాలు కల్తీ గా వస్తున్నాయని, కనీసం బిల్లులు కూడా ఇవ్వడం లేదని అన్నారు. కల్తీ రసాయనాలు విక్రయిస్తున్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జడ్పీసీఈవో ఎల్లయ్య తో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా కు చెందిన పలు శాఖల అధికారులు హాజరయ్యారు.

జడ్పీ చైర్ పర్సన్ తో పాటు సభ్యుల కు ఘన సన్మానం

జిల్లా పరిషత్ పాలక వర్గం పదవి కాలం ముగియనుండడంతో జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీ లను ఘనంగా సన్మానించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులను శాలువాలు, మెమోంటో లతో సన్మానించారు. ఐదేళ్ల పదవీకాలం ముగింపు సందర్భంగా ప్రసంగించారు. స్నేహపూర్వక వాతావరణంలో సమావేశాలు జరిగిన తీరును గుర్తు చేసుకున్నారు. అధికారులు, సభ్యులు ఎంతగానో సహకరించారని చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ అన్నారు.

Next Story

Most Viewed