ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

by Sridhar Babu |
ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
X

దిశ, జహీరాబాద్ : ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు కోరారు. జహీరాబాద్ పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో వినాయక చవితి ( నిమజ్జనం) , మీలాద్ ఉన్ నబి పండుగలపై ఎమ్మెల్యే సమీక్షించారు. జహీరాబాద్ ఆర్డీఓ ఎస్.రాజు, డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత ఇతర శాఖల అధికారులతో ఏర్పాట్లపై ఆరాతీశారు. అవసరమగు పలు సూచనలు చేశారు. పండుగల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, గణపతి మండపాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని, నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలన్నారు.

శోభాయాత్ర జరిగే రహదారుల్లో గుంతలు పూడ్చి మరమ్మతులు చేయాలని, విగ్రహాల తరలింపులో ఆటంకం లేకుండా అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలన్నారు. అదేవిధంగా ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పోలీస్ లకు సూచించారు. అగ్ని మాపక, వైద్య , విద్యుత్ తదితర సిబ్బంది చేపట్టాల్సిన పనులపై సూచనలు చేశారు. నారింజ వద్ద , పట్టణ ప్రధాన కూడళ్లలో లైట్ల ఏర్పాటు, మండపాల వద్ద కరెంట్ సమస్యలు ఉత్పనం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ తంజిమ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మాజీ పట్టణ అధ్యక్షులు యాకూబ్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story