పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: ఎమ్మెల్యే రఘునందనరావు

by Shiva |
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: ఎమ్మెల్యే రఘునందనరావు
X

దిశ, దుబ్బాక: వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మాధవనేని రఘునందనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం దుబ్బాక మండలంలోని బల్వంతాపూర్, పద్మశాలి గడ్డ, చెల్లాపూర్, దుబ్బాక ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వడగండ్లతో వానకు ధ్వంసమైన వరి పంటలను ఎమ్మెల్యే, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.

తీవ్రంగా నష్టపోయిన తమను ఆదకోవాలని బాధిత రైతులు ఎమ్మెల్యే ముందు గొడును వెళ్లబోసుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను వెంటనే సర్వే చేయించి రైతులకు ఎకరకు రూ.10 వేల చోపున్న నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు నష్ట పోయిన రైతులకు ఇచ్చిన పరిహారాన్ని దుబ్బాక ప్రాంత రైతులకు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

దుబ్బాకతో పాటు చెల్లాపూర్, మల్లాయ పల్లి, బల్వాంతాపుర్, దుంపలపల్లి, పద్మశాలి గడ్డ, నర్లెంగ గడ్డ, రాజక్క పేట, ఎల్లాపూర్ గ్రామాల్లో 2,290 ఎకరాల్లో వరి పంట పాడైంది. 1,319 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రైతులు అధైర్యపడొద్దని, రైతులకు న్యాయం జరిగే వరకు శక్తి వంచన లేకుండా ప్రభుత్వంతో కొట్లాడుతనని భరోసా కల్పించారు. పారదర్శకంగా సర్వే నిర్వహించి రైతులతో పాటు కౌలు రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట వ్యవసాయ శాఖ ఏడీ శ్యాం సుందర్, ఏవో ప్రవీణ్, కౌన్సిలర్ మట్టా మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ తిరుపతి, బీజేపీ నాయకులు అంబటి బాలేష్ గౌడ్, సుంకోజి ప్రవీణ్, సత్తు తిరుమల్ రెడ్డి, కొండి ఎల్లారెడ్డి తదితులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed