స్వామియే శరణం అయ్యప్ప.. ఏటా పెరుగుతున్న స్వాముల సంఖ్య

by Javid Pasha |   ( Updated:2022-11-28 10:42:07.0  )
స్వామియే శరణం అయ్యప్ప.. ఏటా పెరుగుతున్న స్వాముల సంఖ్య
X

దిశ, పెద్ద శంకరంపేట: పెద్ద శంకరంపేట మండలంలో అయ్యప్ప శరణు ఘోష స్వామి నామస్మరణతో మారుమోగిపోతోంది. 1991లో మండలంలో మొదలైన అయ్యప్ప దీక్షలు 32 సంవత్సరాల పాటు కొనసాగుతూ వస్తున్నాయి. ప్రతి ఏటా దీక్షదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మాల ధరించిన వాళ్ళలో యువకులు అధికంగా ఉన్నారు. ఈ సంవత్సరం అత్యధికంగా 115 మంది అయ్యప్ప మాల ధరించి స్వామి సేవలో పునీతులు అవుతున్నారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా యువకులు ఆధ్యాత్మిక చింతన వైపు రావడం శుభ సూచకమని రామచంద్ర చారి గురుస్వామి పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేవలం శంకరంపేటలోనే దాదాపుగా 40 మంది కన్య స్వాములు మాలలు వేసుకున్నారని తెలిపారు.

అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటారు?

మణికంఠుని దీక్షలో భాగంగా నల్లటి దుస్తులు ధరిస్తారు. 40 రోజుల పాటు స్వాములు కటిక నేల మీదనే నిద్రిస్తారు. చల్లటి నీటితో మాత్రమే స్నానం చేస్తారు. అలాగే దీక్ష అయిపోయేంత వరకు ఎలాంటి పాదరక్షలు ధరించరు. అయితే ఇలా అయ్యప్ప మాలలు ఎందుకు వేసుకుంటారు? అయ్యప్ప మాల ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి? మాల వేసిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తారు? వంటి ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అయ్యప్ప స్వామి దీక్ష

ఈ దీక్షలో మండల కాలం 41 రోజుల పాటు కొనసాగిస్తారు. ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనం స్ఫటికం, పగడాలు, తామర పూసల మాలలు ధరిస్తారు. ఇవి మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుంది అనేది భక్తుల నమ్మకం. శబరిమలలోని 18 మెట్లు ఎక్కి మణికంఠ స్వామిని దర్శించుకోవడంతో ఈ దీక్షతో ముగుస్తుంది. ఈ కాలంలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవితం గడపాల్సి ఉంటుంది.

అయ్యప్ప దీక్షతో ప్రయోజనాలు

అయ్యప్ప దీక్షలో నేలపై నిద్రించడం వల్ల వెన్నునొప్పులు తొలగిపోతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తెల్లవారు జామున లేచి చన్నీటి స్నానం చేయడం వలన నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది. ప్రతిరోజు దుస్తులు తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది. దీపారాధన చేయడం వలన ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగి మానసిక ప్రశాంతత ఉంటుంది.

దీక్షలో నలుపు దుస్తుల విశిష్టత

అయ్యప్ప స్వామి దీక్షలు ఉండే వారంతా నల్లని దుస్తులు ధరిస్తారు. దానికి కారణమేంటంటే శని దేవుడికి నల్లని రంగు అంటే మక్కువ. ఆ రంగు బట్టలు ధరించి నిత్యం పూజలో పాల్గొన్న వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతారు. అంతేకాదు చలికాలంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ దీక్ష సమయ కాలంలో చేసే కృతువులు మానసిక పరివర్తనకు నాంది పలుకుతాయి.

స్వామి అనే నిబంధన

అయ్యప్ప మాలలు ధరించిన వారు స్వామి అని సంబోధించుకోవడం వలన నేను అనే భావన తొలగిపోతుంది. అయ్యప్ప మాల వేసిన భక్తుడు శరీరానికి ఉండే పేరు వాటి కోసం ధరించేది దుస్తులు ఆచార వ్యవహారాలు దినచర్య పూర్తిగా మారిపోతాయి. అందుకే అయ్యప్ప మాల ధరించిన భక్తుడు జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో ప్రతి ఒక్కరిని ''స్వామి'' అని పిలుస్తుంటారు.

Advertisement

Next Story

Most Viewed