రైతుల కోసం పదేళ్ల కిందే మార్కెట్ యార్డ్ తీసుకొచ్చా..: మంత్రి దామోదర రాజనర్సింహ

by Aamani |
రైతుల కోసం పదేళ్ల కిందే మార్కెట్ యార్డ్ తీసుకొచ్చా..: మంత్రి దామోదర రాజనర్సింహ
X

దిశ, అందోల్: రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా గత పదేండ్ల కింద కాంగ్రెస్ హాయం లో ఆందోల్ నియోజకవర్గంలో నూతన మార్కెట్ యార్డ్ లను తీసుకువచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం రాయికోడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినా సుధాకర్ రెడ్డి తో పాటు వైస్ చైర్మన్ వినయ్ కుమార్, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి దామోదర మాట్లాడుతూ పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలకు మంచి రోజులు వచ్చాయన్నారు. ఆందోల్ నియోజకవర్గం లోని మూడు మార్కెట్ యార్డ్ లకు నూతన మార్కెట్ కమిటీని నియమించినట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు సభ్యులు మార్కెట్ యార్డు అభివృద్ధికి కృషి చేయడంతో పాటు రైతుల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు.

కాంగ్రెస్ తోనే రైతు సంక్షేమం సాధ్యమని తెలిపారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని రైతు అభివృద్ధి చెందితే గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని నమ్మి ఆనాడు ఆందోల్ నియోజకవర్గంలో రాయికోడ్, వట్ పల్లి రెండు మార్కెట్ యార్డ్ లను తీసుకువచ్చానన్నారు. మార్కెట్ కమిటీలతో రైతులు పండించే పంటలకు మార్కెటింగ్ సులువు కావడంతో పాటు ఇక్కడ గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని మార్కెట్ యార్డు లను మంజూరు చేసామన్నారు. అయితే గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో ఉన్న మూడు మార్కెట్ కమిటీలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మళ్లీ నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్లకు పునర్ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాయికోడ్ లో రూ.3 కోట్లతో రైతుల సౌకర్యార్థం పత్తి గోదామును నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు సిఎస్సార్ నిధుల ద్వారా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన బోరంచ ఎత్తిపోతల పథకాన్ని త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు వివరించారు. నియోజకవర్గంలో ఉన్న రైతుల శ్రేయస్సు కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలనను గుర్తుతెస్తూ రైతులకు ఒకే విడతలో రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకొని కావలసిన సంక్షేమ పథకాల అందించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.

జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ మాట్లాడుతూ పదేళ్ల తర్వాత మళ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చిందన్నారు. మంత్రి దామోదర సహకారంతో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీఎంఓ రియాజ్, ఆర్డిఓ రాజు, రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్ ఎస్. జగన్ మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, పిసిసి సభ్యుడు గజ్వాడ కిషన్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్లు ఎస్. సురేందర్ గౌడ్, రంగ సురేష్, డాకూర్ శంకర్, జోగిపేట ఏఎంసీ చైర్మన్ ఎం.జగన్ మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు యేసయ్య, రాంరెడ్డి, రాయికోడు, మునిపల్లి, రేగోడు, అల్లాదుర్గం మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింలు, సతీష్, దిగంబరావ్, శేషారెడ్డి, నియోజవర్గ సీనియర్ నాయకులు పి.ప్రవీణ్, శివకుమార్, అరిగే రాములు తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed