ఎన్నికల బాండ్ల వివరాలు బయట పెట్టాల్సిందే

by Naresh |
ఎన్నికల బాండ్ల వివరాలు బయట పెట్టాల్సిందే
X

దిశ, సంగారెడ్డి : ఎన్నికల బాండ్ల వివరాలను బయట పెట్టాల్సిందేనని, సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించిన ఎస్బీఐ చైర్మన్‌ను అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం అఖిల భారత పిలుపు మేరకు దేశంలోని అన్ని ఎస్బీఐ బ్యాంకుల ముందు ధర్నా నిర్వహించి బ్యాంక్ మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి జి. జయరాజు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.మల్లిఖార్జున్‌లు మాట్లడుతూ.. సుప్రీం ఇచ్చిన గడువును ఎస్‌బీఐ ఉల్లంఘించడం సరికాదన్నారు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి, మార్చి 6వ తేదీ కల్లా ఆ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాలని సుప్రీం ఆదేశించిందన్నారు. తమకు జూన్‌ 30వరకు గడువు కావాలంటూ సుప్రీం కోర్టుకు దరఖాస్తు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. రూ. 48 కోట్ల ఖాతాలు కలిగిన, ఉన్నత స్థాయిలో డిజిటలైజేషన్‌ జరిగిన, దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ అయిన ఎస్‌బీఐ, రికార్డులు రాతపూర్వకంగా భద్రపరిచామనే పేలవమైన సాకు చూపి గడువు పొడిగించమని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లోగా తాము సమాచారం అందించలేమని ఎస్‌బీఐ చెప్పడం చూస్తుంటే అధికారంలో వున్న ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు రాకుండా కాపాడేందుకు ఎస్‌బీఐ ఒక కవచంలా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

బాండ్లు ఇచ్చినవారికి, తీసుకున్నవారికి మధ్య క్విడ్‌ ప్రోకో భాగోతం నడిచిందని, కొన్ని సార్లు తమకు అనుకూలంగా లేని కార్పొరేట్ల పై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని సంస్థలతో దాడులు, బెదిరింపులకు దిగారని అన్నారు. విరాళాలు ఇచ్చిన వారికి ప్రభుత్వం చేసి పెట్టిన పనుల వివరాలు కూడా బయటకు రావాలని వారు కోరారు. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్, మల్లేశం, రాజయ్య, నాయకులు యాదగిరి, అశోక్, కృష్ణ, రమేష్, మహేష్, బాబూరావు, బాల్ రాజు, శివ, బాలు , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed