గజ్వేల్ సీటుపై డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి నజర్

by Mahesh |
గజ్వేల్ సీటుపై డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి నజర్
X

ఆసక్తికర రాజకీయాలకు గజ్వేల్ నియోజకవర్గం వేదిక అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించడం కోసం అధికార పార్టీకి చెందిన నేతలు పోటీ పడుతున్నారు. నిన్నమొన్నటి వరకు సాధారణంగానే ఉన్న డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి ఒక్కసారిగా హల్ చల్ చేస్తుండడం ఆసక్తిగా మారింది. సెగ్మెంట్ లో పలు సమస్యలు గుర్తించిన ఆయన వీటి పరిష్కారానికి కృషి చేయాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్​రావును కలిసి వినతి పత్రాలు ఇవ్వడంపై రాజకీయంగా చర్చ జరుగుతున్నది. ఉన్నట్టుండి అంజిరెడ్డి ఇలా కొత్త దారి ఎంచుకున్నాడు..? ఆయన వ్యూహం ఏమిటి..? అనే వ్యవహారం అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, సంగారెడ్డి బ్యూరో: ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ అంజిరెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడుతుంటారు. డీసీసీబీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే మర్కుక్, ములుగు మండలాల్లో రాజకీయంగా గుర్తింపు పొందారు. ఇటు వ్యవసాయ క్షేత్రంతో పాటు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ కు బట్టు వెళ్లి వచ్చే విషయం స్థానికంగా అందరికి తెలుసు. అయితే ఇప్పటి వరకు ఆయన స్థానిక రాజకీయాలపై దృష్టి పెట్టేవారు. ఇటీవలే ఆయన నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్​రావుల వద్దకు..

గజ్వేల్ నియోజకవర్గంలో పెండింగ్ లో వివిధ సమస్యలను పరిష్కారించాలని మూడు రోజుల క్రితం బట్టు అంజిరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వద్దకు వెళ్లారు. తాను గుర్తించిన సమస్యల వివరాలను వినతి పత్రం రూపంలో సీఎం కేసీఆర్ కు అందించారు. ఈ సందర్బంగా అంజిరెడ్డితో సీఎం కేసీఆర్ ముచ్చటించారు. ఇంకా ఎలాంటి సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి.? ఏది ఉన్నా చెప్పాలి. వాటిని పరిష్కరించుకుందాం..అని సీఎం హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ ను కలిసిన మరుసటి రోజే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావును కూడా కలిశారు. సమస్యలకు సంబంధించిన వినతి పత్రం అందించగా అధికారులతో చర్చించి ఆ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

కొత్తగా ఈ వినతి పత్రాలతో వెళ్లడంతో...

ఇప్పటి వరకు రాజకీయంగా సైలెంట్ గానే ఉండే అంజిరెడ్డి ఒక్కసారిగా నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై ఎందుకు దృష్టి సారించారు..? సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు వద్దకు ఎందుకు వెళుతున్నట్లు..? రోజు వారిగా ఏదో రకంగా మీడియాలో ఉండడం వెనుక అంజిరెడ్డి వ్యూహమేమిటని బీఆర్ఎస్‌లో చర్చ జరుగుతోంది. ఇదే కాకుండా ఆలయాలు, ఇతర కార్యక్రమాలకు కూడా అంజిరెడ్డి వేలు, లక్షల్లో ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

ఇప్పటికే మంత్రి హరీశ్​రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే గజ్వేల్‌లో గ్రూప్ రాజకీయాలు కూడా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఓ గ్రూపుకు లీడర్‌గా అంజిరెడ్డి రంగంలోకి దిగినట్లు పార్టీ నాయకులు అంటున్నారు. ఆయన ఇంకా ఏం చేయనున్నారు..? పార్టీ అధిష్టానం నుంచి సహకారం ఎలా ఉండనున్నది..? అంజిరెడ్డి ఏ మేరకు బలపడనున్నారని వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed