సిద్దిపేటలో హిందుత్వం పై జరిగిన దాడికి సీఎం సమాధానం చెప్పాలి: విశ్వహిందూ పరిషత్

by Mahesh |
సిద్దిపేటలో హిందుత్వం పై జరిగిన దాడికి సీఎం సమాధానం చెప్పాలి: విశ్వహిందూ పరిషత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ కు హిందుత్వంపై ఇంత విద్వేషం ఎందుకని విశ్వహిందూ పరిషత్ నాయకులు ప్రశ్నించారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 25న సిద్దిపేట నగరంలోని 34 వ వార్డులో గల విశ్వహిందూ పరిషత్ జెండా పోల్ కు గులాబీ రంగు వేయించి టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం దుర్మార్గమైన చర్య అని వీహెచ్ పీ మండిపడింది. భగవంతుడి ధ్వజానికి కాషాయ రంగు తొలగించి మరీ గులాబీ రంగు వేయడంపై విశ్వహిందూ పరిషత్ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఇంతటి ఘోరానికి పాల్పడటం ఎంతటి విద్వేషమని వీహెచ్‌పీ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ బాలస్వామి మండిపడ్డారు. హిందూ వ్యతిరేక ఎజెండాతో ముందుకు సాగడంలో భాగంగానే ఈ దుశ్చర్యకు దిగారన్నారు.

ఈ ఘోరానికి బాధ్యులు ఎవరో గుర్తించి దండించాల్సిన బాధ్యత మంత్రిపై లేదా? అని ప్రశ్నించారు. జరిగిన పొరపాటుకు హిందూ సమాజానికి మంత్రి క్షమాపణ చెప్పాలని, గులాబీ రంగును తొలగించి కాషాయ రంగు వేయించి భగవ ధ్వజాన్ని రెపరెపలాడించి తన గౌరవాన్ని కాపాడుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాలని హెచ్చరించారు. బీజేపీపై బిఆరెస్‌కు ద్వేషం, కక్ష ఉంటే ఆ పగను హిందుత్వంపై చూపడం దుర్మార్గమని ఫైరయ్యారు. కారు స్టీరింగ్ హైదరాబాద్ ఎంపీ చేతిలో ఉంది అంటే ఇదేనేమోనని ఆయన ఎద్దేవా చేశారు. తనకు తాను వీర భయంకరమైన హిందువుగా చెప్పుకునే ముఖ్యమంత్రి ఈ ఘటనపై సమాధానం చెప్పాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed