తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డు: మంత్రి హరీష్ రావు

by Shiva |
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డు: మంత్రి హరీష్ రావు
X

దిశ, ప్రజ్ఞాపూర్: రాష్ట్రాల మధ్య పోటీ సృష్టించి అభివృద్ధిలో ముందుకు సాగేందుకు రాష్ట్రాలకు కేంద్రం సహకారం అందించడం పోయి అభివృద్ధిని అడ్డుకోవడానికి మోదీ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గజ్వేల్ మహతి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

కేంద్రం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి పెద్ద మొత్తంలో కేంద్రానికి ఆదాయం వస్తున్నా.. కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులు మాత్రం అరకొరగానే మంజూరు చేస్తుందన్నారు. రాష్ట్రానికి రావలసిన నిధులను కూడా వివిధ సాకులు చూపుతూ నిలిపివేస్తుందని ఆరోపించారు. కేంద్రం వివిధ రకాలుగా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసినా సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం తీవ్ర కృషి చేస్తున్నారని తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబాటు గురైన తెలంగాణ ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. అప్పుడు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, ఆకలిచావులు, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలను పరిశీలించడానికి వచ్చిన ఇతర రాష్ట్ర ప్రతినిధులు నేడు అనేక రంగాల్లో అభివృద్ధిని సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కు గజ్వేల్ ప్రజలు అంటే ఇష్టమని అడగకుండానే గజ్వేల్ కు అన్ని రకాల సౌకర్యాలను అందించారని స్పష్టం చేశారు.

గజ్వేల్ ప్రజలు సీఎం కేసీఆర్ కు మరోసారి అండగా నిలిచి రాష్ట్రానికి, దేశానికి సేవలందించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశానికి ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించగా మెదక్ జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, డీసీసీడీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎలక్షన్ రెడ్డి, భూమ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్, దేవి రవీందర్, ఎన్.సీ రాజమౌళి, రవీందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story