పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

by Naresh |
పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
X

దిశ, మెదక్ ప్రతినిధి: పదో తరగతి పరీక్షల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం, పదో తరగతి పరీక్షల నిర్వహణపై రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారని కలెక్టర్ తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారని వివరించారు. మొత్తం విద్యార్థులు 10,300 మంది హాజరు కానున్నారని, జిల్లాలోని మొత్తం 68 సెంటర్‌లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయాని కంటే గంట ముందే చేరుకోవాలని, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తీసుకురావద్దని సూచించారు.

ఫ్లయింగ్ స్క్వాడ్ మూడు బృందాలు పనిచేస్తాయని చెప్పారు. ప్రతి సెంటర్‌కు రెండు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు, పరీక్ష కేంద్రాలను శుభ్రం చేయించాలని, తాగునీటి వసతి కల్పించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్య సిబ్బంది వద్ద మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా పెట్టుకోవాలని, పరీక్షలు నిర్వహించే రోజుల్లో ఆర్టీసీ వారు బస్‌లను సమయానుకూలంగా నడిపించాలని, విద్యుత్ అధికారులు విద్యుత్ కోతలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. పరీక్ష పత్రాలు పోలీస్ బందోబస్తు మధ్య తరలించాలని, చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు ఉండాలని కలెక్టర్ తెలిపారు. పటిష్ట పర్యవేక్షణ నడుమ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed