డిజిటల్ బోధనతో ఎంతో ప్రయోజనం

by Sridhar Babu |
డిజిటల్ బోధనతో ఎంతో ప్రయోజనం
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : డిజిటల్ బోధనతో విద్యార్థులకు తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు విద్యార్థులు నేర్చుకుంటారని, దృశ్యశ్రవణ పద్ధతిలో ఉపాధ్యాయులకు సులువుగా బోధించే వీలు కలుగుతుందదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. గురువారం కంది మండలం కాశీపూర్ గ్రామంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు నేర్పించే పాఠాలు, వారికి అందించే భోజనం ఇలా అన్నింట్లో వారికి ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు టీచర్లు పాఠాలు ఎలా బోధిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోధనలో నూతన పద్ధతులు అవలంబించాలని, బోధనోపకరణాలను ఉపయోగించి విద్యార్థులకు బోధిస్తే

విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుంటారని, బోధన ఉపకరణాలను బోధనలో ఉపయోగించడం వల్ల విద్యార్థి తాను చదువుకున్న అంశాన్ని దీర్ఘకాలం పాటు జ్ఞాపకం ఉంచుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బోధించిన పాఠ్యాంశాలలోని విషయాలను విద్యార్థులను అడిగి వారి మేధాశక్తిని పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో స్టాక్ రిజిస్టర్ ను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులను పరిశీలించారు.

పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు పెట్టడంతో పాటు, పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి తగిన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed