మినరల్ మాయ.. మంచినీరు పేరిట మహా మోసం

by Mahesh |
మినరల్ మాయ.. మంచినీరు పేరిట మహా మోసం
X

ప్రజల తాగునీటి అవసరాలు ఆసరా చేసుకున్నారు ఆ వ్యాపారులు. నీరున్న ప్రాంతం.. రవాణాకు అనువుగా ఉండే ప్రదేశంలో గది అద్దెకు తీసుకుని బోరేసుకుంటారు. మూడు ఆటోలు, వంద క్యాన్లు కొనుగోలు చేసి.. నలుగురు మనుషులను వర్కర్లుగా పెట్టుకుంటారు. ఉదయం లేచింది మొదలు పొద్దుపోయే వరకు మోటారుతో క్యాన్లలో నీటిని నింపుతూ.. ఇంటింటికి తిరుగుతూ అమ్ముతుంటారు. డబ్బులు పెట్టి కొంటున్నాం కదా.. మినరల్ వాటరే తాగుతున్నాం అనుకుంటారు. కానీ.. అవన్నీ జనరల్ వాటర్ అనే విషయం సామాన్య ప్రజలకు తెలియదు. మండలంలో కంగ్టి, నాగంపల్లి, వాడగమ, తడ్కల్, దామర్ గిద్ద, తదితర గ్రామాల్లో అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు వెలుస్తున్నా. అనుమతి లేని ప్లాంట్ల వైపు అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. అనుమతి పొందిన ప్లాంట్ల కంటే లేనివే ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇళ్ల మధ్యలోనూ ఈ నీటి శుద్ధి కేంద్రాలు ఉండడం రేయింబవళ్లు ఊర్ల బోర్ల ద్వారా నీటిని తోడేస్తున్నారు. దీంతో ఆ కేంద్రాల సమీపంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి . సమీపంలో ఉన్న ఇళ్లలోని బోర్లలో నీటిమట్టం తగ్గుతుంది. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా యదేచ్చగా నీటి దోపిడీ చేస్తున్నారు.

దిశ, కంగ్టి: కంగ్టి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో సైతం ప్రైవేటు వాటర్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల వద్ద నుంచి నీటిని తోడుతున్నారు.వీటిలో దాదాపు అన్ని అనుమతులు దేనివే ఉన్నాయి. నిర్వాహకులు ప్రమాణాలు పాటించకుండా ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. నిబంధనల ప్రకారం లించెన్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నిర్దేశించిన ప్రమాణాలు పాటించాల్సి ఉంది.

ఫ్లోరిన్ ఎక్కవతో ఇబ్బందులు

మనం తాగు నీటిలో ఫ్లోరిన్ కనీసం 0.5 నుంచి 0.8 వరకు పీపీఎం (పార్ట్ పర్ మిలియన్) ఉండాలి. ప్రస్తుతం విక్రయిస్తున్న నీటిలో 2 పీపీఎం కంటే ఎక్కవ శాతం ఫ్లోరిన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు వృద్ధి చెందుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక సారి మినరల్ వాటర్ నింపిన క్యాన్ను ప్రత్యేక కెమికల్స్ ద్వారా శుద్ధి చేసి దాన్ని 48 గంటల వరకు వాడకూడదనే నిబంధన ఉన్నా అది ఎక్కడ అమలు కావడం లేదు. బోర్ల నుంచి వచ్చే నీటిని కాకుండా వేరే నీటిని వాడుతుండటంతో క్యాన్ కింది భాగంలో పాచి పట్టినట్లు వస్తుంది. ఆ నీరు తాగితే రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఇష్టానుసారంగా లిక్విడ్ వినియోగం..

నీటిని శుద్ధి చేయడానికి మినరల్ వాటర్ ప్లాంట్లలో డోజింగ్ లిక్విడ్ను వినియోగిస్తుంటారు. ఈ లిక్విడ్ను 20 లీటర్ల శుద్ధి జలాన్ని తయారు చేసేందుకు 100 నుంచి 150 గ్రాముల వరకు ఉపయోగిస్తారు. మిషన్ ద్వారా పంపించిన లిక్విడ్ నీటిని శుద్ధి చేసి.. వృధా నీటి ద్వారా బయటకు వస్తుంది. చాలా వాటర్ ప్లాంట్లలో ఈ లిక్విడ్ ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్లలో నీటిని శుద్ధి చేయడానికి నీటిలో ఫ్లోరైడ్ శాతాన్ని లెక్కించి నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. నీటిలో ఫ్లోరైడ్ శాతం 1000 నుంచి 1500 శాతానికి పైగా ఉంటే.. ఆ నీటిని శుద్ధి చేస్తే అధిక శాతం నీరు వృథా అవుతుంది. దీంతో అత్యధిక శాతం నీరు నిరుపయోగంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న నీటిని శుద్ధి చేసేందుకు అనుమతులు ఇవ్వరు.

ఈ నీటిని వినియోగించాలి

హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రమే కలిగిన నీటిని వినియోగించాలని నిపుణులు పేర్కొంటున్నారు. మెగ్నీషియం, ఐరన్ వంటి పదార్థాలను తాగునీటి ద్వారానే మనం గ్రహించడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల ప్రభావంతో భూగర్భ జలాలు చాలా చోట్ల కలుషితమై సీసం, ఫ్లోరిన్ లాంటి హానికరమైన మూలకాలు వస్తున్నాయి. వీటిని తొలగించి స్వచ్ఛమైన నీటిని అందిం చేందుకు కొన్ని నిబంధనలతో కూడిన వాటర్ ఫ్లాంట్ ఏర్పాటు చేయాలి. కానీ ఈ ప్రక్రియ ఎక్కడా అమలు కావడం లేదు. నలుగురు సభ్యులున్న కుటుంబం రోజుకు సగటున 20 లీటర్ల వాటర్ క్యాన్‌ని వినియోగిస్తున్నారు. ఆ 20 లీటర్ల వాటర్ క్యాన్ ప్రాంతాన్ని, పోటీని బట్టి ప్లాంట్లో రూ.10 నుంచి 20 వరకు విక్రయిస్తున్నారు. అదే డోర్ డెలివరీ చేస్తే అదనంగా మరో రూ.10–15 వరకు వసూలు చేస్తున్నారు.

ఇలా ఒక కుటుంబం రోజుకు సగటున రూ.30 చొప్పున నెలకు రూ.900 వరకు వెచ్చీస్తోంది. ఇది కాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా బయటకు వెళ్లాల్సి వస్తే వాటర్ బాటిల్‌ను కొని తాగుతున్నారు. లీటరు వాటర్ బాటిల్ ఖరీదు రూ.20 ఉంది.ఇలా నెలలో సగటున ఐదారు బాటిళ్లు తాగిన రూ.100 వరకు ఖర్చవుతుంది. అంటే నెలకు రూ.వెయ్యి చొప్పున ఏడాదికి రూ.12 వేలు కేవలం మంచినీళ్లకే చెల్లించాల్సి వస్తోంది. ఇక కార్యాలయాలకు 20 లీటర్ల వాటర్ క్యాన్ రూ.25–30కు సరఫరా చేస్తున్నారు. మారిన పరిస్థితుల్లో కూలింగ్ మినరల్ వాటర్ పేరిట కూడా నీటిని అమ్ముతున్నారు. 20 లీటర్ల కూలింగ్ క్యాన్కు రూ.40–50 వరకు వసూలు చేస్తున్నారు. ఫంక్షన్లలో ఇలాంటి కూలింగ్ వాటర్కు ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది.

పరిశుభ్రతకు ప్రాధాన్యమేది?

నిత్యం ఇళ్లు, కార్యాలయాల్లో వాడే వాటర్ క్యాన్లను తరుచూ విధిగా మార్చాలి. కానీ మూడు నాలుగేళ్ల వరకు మార్చరు. క్యాన్లపై సంస్థ లేబుల్ ఉండాలి. అవీ ఉండవు. ప్యాకింగ్ యూనిట్ స్టెరైల్గా, ఆపరేషన్ థియేటర్‌లా ఉండాలి. కానీ అపరిశుభ్రత వాతావరణం నెలకొంటుంది. అయినా ఇటు ప్లాంట్ యజమానులు, అటు ప్రజలు పట్టించుకోవడం లేదు.

తక్కువ ఖర్చుతో..

ఐఎస్ఐ ప్రమాణాలు పాటించి ప్లాంట్ ఏర్పాటు చేస్తే కనీసం రూ.20 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. కానీ ఆ ప్రమాణాలు పాటించకుండా రూ.4–5 లక్షలతోనే ఎడాపెడా ప్లాంట్లు పెట్టేస్తున్నారు. ఇలా ఏటా 20 శాతం చొప్పున ఈ వాటర్ ప్లాంట్లు కొత్తగా ఏర్పాటవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

వేసవిలో మరింత ఆదాయం..

ఏడాదిలో ఎనిమిది నెలలు ఎంత ఆదాయం సమకూరుతుందో ఎండాకాలం నాలుగు నెలలు అంత రాబడి వస్తుంది. వేసవిలో తాగునీటి వినియోగం ఇతర సీజన్లకంటే మూడు రెట్లు అధికంగా ఉంటుంది. దీంతో ఈ వాటర్ ప్లాంట్ల నిర్వాహకులకు ప్రస్తుత వేసవి సీజను ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అందుకే ఈ సీజనులో అధికారులు కూడా ‘అవగాహన’తో ఈ ప్లాంట్ల తనిఖీల జోలికి అంతగా వెళ్లరు. చూసీ చూడనట్టు వదిలేస్తుంటారు.

అధికారుల మధ్య సమన్వయలేమి

నిబంధనలు పాటించకుండా నడుస్తున్న వాటర్ ప్లాంట్లను సీజ్ చేసే అధికారం ఆర్డీవోలకే ఉంది. బీఐఎస్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులకు ప్లాంట్‌లో ఉన్న స్టాకు సీజ్ చేయడానికే అధికారం ఉంది. ఆర్డీవో నుంచి ఆదేశాలొస్తేనే తహసీల్దార్లు, ఆహార తనిఖీ, భద్రత అధికారులు సీజ్ చేస్తారు. విద్యుత్ కనెక్షన్ ఇచ్చేటప్పుడే ఫుడ్ లైసెన్స్, బీఐఎస్, రెవెన్యూ పర్మిషన్‌లు ఉన్నాయా? లేదా చూసి ఇవ్వాలి. కానీ అవేమీ చూడకుండానే కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. పైగా ఇలాంటి అనధికారిక వాటర్ ప్లాంట్ల‌పై చర్యలు తీసుకునే విషయంలో సంబంధిత అధికారుల మధ్య సమన్వయం లేదు. ఇవన్నీ వెరసి అనధికారిక వాటర్ ప్లాంట్ల యజమానులకు వరంగా మారింది.

‘కొని’ తెచ్చుకుంటున్న రోగాలు

డివిజన్‌లో అధిక శాతం వ్యాపారులు వాటర్ ప్రాసెసింగ్ చేయకుండానే నేరుగా కుళాయిల ద్వారా క్యాన్లలో నీటిని నింపి సరఫరా చేస్తున్నారు. మినరల్ వాటర్లో టీడీఎస్ స్థాయిని (టోటల్ డీ సాల్వ్డ్ సాలిడ్స్) అతి తక్కువ మోతాదుకు తగ్గిస్తు న్నారు. ఈ నీటిని దీర్ఘకాలం తాగితే మూత్ర పిండా లు, రక్తపో టు, గుండె సంబంధిత జబ్బులు తప్పవని వైద్యులు హెచ్చరి స్తున్నారు. ఒక్క లీటరు నీటిని శుద్ధి చేయాలంటే సుమారు మూడు లీటర్లకు పైగా నీరు అవసరమవుతోంది. నిబంధనల ప్రకారం బోర్లు నుంచి మాత్రమే నీటిని వాడాల్సి ఉంది.

దీంతో ప్లాంట్లలో భూగర్బ జలాల శాతం పడి పోతుండడంతో కొంత మంది వ్యాపారులు నీటిలో కెమికల్స్ కలిపి అవే మినరల్ వాటర్గా చెప్పి విక్రయిస్తున్నాయి. మరికొన్ని వాటర్ ప్లాంట్లలో వాటర్ క్యాన్లను సైతం శుభ్రం చేయకుండా నీటిని నింపి అమ్మేస్తున్నారు. అధికారులు స్పందించి అనుమతులు లేకుండా నడుస్తున్న, నిబందనలు పాటించని వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story