నేడు కాంగ్రెస్‌లోకి మేయర్.. ఎంత మంది కార్పొరేటర్లతో చేరుతున్నారో తెలుసా?

by GSrikanth |
నేడు కాంగ్రెస్‌లోకి మేయర్.. ఎంత మంది కార్పొరేటర్లతో చేరుతున్నారో తెలుసా?
X

దిశ, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేని కాంగ్రెస్ పార్టీ 2025లో వచ్చే మున్సిపల్ ఎన్నికల కల్లా నగరాన్ని ‘హస్త’గతం చేసుకునేందుకు, సిటీలో కాంగ్రెస్ పార్టీని ఓ తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు గాను ఇటీవలే బీఆర్ఎస్‌ను వీడిన సీనియర్ నాయకుడు కే.కేశవరావును చక్కటి ఆయుధంగా వినియోగిస్తుందన్న వాదనలున్నాయి. కేశవరావు కుమార్తె, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

మేయర్ బాటలోనే మరో పది మంది కార్పొరేటర్లున్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది కార్పొరేటర్లు కష్టమొచ్చో, పార్టీ పనుండో కేసీఆర్, కేటీఆర్‌లను కలిసేందుకు ప్రయత్నించినా, వారు పట్టించుకోని వారే ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పాలకమండలికి బాస్‌గా వ్యవహరించే మేయర్ కాంగ్రెస్‌లో చేరితే, తామెందుకు ఇంకా బీఆర్ఎస్‌లో కొనసాగాలి? అంటూ ఆమెతో క్లోజ్‌గా ఉన్న పలువురు కార్పొరేటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్నా, అధికారం కోల్పోయిన తర్వాత కూడా తమ లాంటి చిన్న స్థాయి ప్రజాప్రతినిధులను కలిసేందుకు కూడా ఇష్టపడని నేతలున్న ఆ పార్టీలో కొనసాగితే మున్ముందు ఎలాంటి గుర్తింపు రాదని కూడా కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం.

పెరగనున్న కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య..

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్‌లోని 150 వార్డుల్లో కేవలం మూడు వార్డు్లో మాత్రమే కాంగ్రెస్ కార్పొరేటర్లు విజయం సాధించగా, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన తర్వాత ఆ సంఖ్య 11కు చేరగా, శనివారం మేయర్ చేరికతో అది కాస్త పన్నెండుకు చేరనుంది. ఇక మేయర్‌తో సన్నిహితంగా ఉన్న మరో పది మంది కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్యా బలం 22కు చేరే అవకాశమున్నట్లు సమాచారం. మేయర్‌తో క్లోజ్‌గా ఉండే పది మంది కార్పొరేటర్లతో పాటు మరో పది మంది కార్పొరేటర్లు తాము ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ నుంచే 2025 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఖరారు చేయించే హామీ ఇస్తే తాము కూడా కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యేందుకు సిద్దమేనని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వీరిలో ఎక్కువ మంది శివారు డివిజన్లకు చెందిన వారున్నట్లు సమాచారం.

ఎంపీ ఎన్నికల్లో వీరు ఎటు వైపు?

ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్లు, పలువురు ఎమ్మెల్యేలు ఎంపీ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ విజయం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తుండగా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు కనీస గుర్తింపులేని సుమారు పది మంది కార్పొరేటర్లు తాము కార్పొరేటర్లుగా ఉన్న డివిజన్ నుంచి మళ్లీ టికెట్ ఖరారు చేస్తే కాంగ్రెస్‌లోకి వస్తామని చెబుతున్న ఆ పది మంది కార్పొరేటర్లు ఎంపీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? అంతలోపు మేయర్ విజయలక్ష్మి వారికి సీటు గ్యారెంటీ హామీ ఇప్పించగలరా? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఒక వేళ ఎంపీ ఎన్నికల ముందే హామీ ఇప్పించగలిగితే, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటింగ్ శాతం పెరిగినట్టేనని ఆ పార్టీ క్యాడర్ చెబుతుంది. 2016లో అప్పటి టీఆర్ఎస్ సర్కారు హయాంలో ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు నేటి వరకు ప్రత్యేకంగా కార్పొరేటర్ బడ్జెట్ అంటూ లేకపోవటంతో బీఆర్ఎస్ పార్టీలోని చాలా మంది కార్పొరేటర్లు గుర్రు మీద ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్‌తో పాటు కొందరు బీజేపీ కార్పొరేటర్లు సైతం ఇప్పుడే కాంగ్రెస్‌లో చేరితే మన పార్టీ, మన మేయర్, మన సర్కారు అన్న భావనతో పలు ప్రజాసమస్యలకు పరిష్కారాన్ని చేకూర్చుకోవటంతో పాటు అభివృద్ది పనులు చేయించుకోవచ్చునని చర్చించుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed