Maheshkumar goud: "ప్రజాపాలన"ను ప్రారంభించిన ఘనత నాదే.. టీపీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |
Maheshkumar goud: ప్రజాపాలనను ప్రారంభించిన ఘనత నాదే.. టీపీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ కార్యక్రమం అట్టడుగు వర్గాల ప్రజలతో ఉన్న బంధాన్ని బలోపేతం చేస్తుందని, ఈ ఘనత తనకు దక్కినందుకు సంతోషంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో "ప్రజాపాలన- ఇందిరమ్మ రాజ్యం" అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. దీనిపై మహేశ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన .. ప్రభుత్వానికి, మన కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వారధిగా పనిచేస్తూ ఈరోజు గాంధీభవన్‌లో ప్రజాపాలన - ఇందిరమ్మ రాజ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఘనత తనకు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ చొరవ అట్టడుగు వర్గాలతో ఉన్న బంధాన్ని బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుందని అన్నారు.

వారానికి రెండు సార్లు మంత్రులు అందుబాటులో ఉంటారని, కష్టపడి పనిచేసే పార్టీ కార్యకర్తల ఆందోళనలు, సమస్యలను నేరుగా పరిష్కరించేలా చూస్తామని వెల్లడించారు. ఈ ప్లాట్‌ఫారమ్ కమ్యూనికేషన్‌ను పెంపొందించడమే కాకుండా ప్రజల కోసం ఒక వాయిస్‌గా ఉండేలా ప్రతి కార్మికుడిని శక్తివంతం చేస్తుందని చెప్పారు. ఈ దృక్పథాన్ని సాకారం చేయడంలో తిరుగులేని సహకారం అందించిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి, మంత్రివర్గ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తామందరం అంకితభావం, పారదర్శకతతో ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని టీపీసీసీ చీఫ్ అన్నారు. కాగా మహేశ్ కుమార్ గౌడ్ టీపీసీసీ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు వారంలో రెండు సార్లు గాంధీభవన్ లో ప్రజల వినతులు స్వీకరించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి గాంధీభవన్ వేదిక కావాలని కోరారు. దీనికి సీఎం సహా కేబినెట్ సుముఖత వ్యక్తం చేయడంతో బుధవారం నుంచి గాంధీభవన్ లో ప్రజాపాలన- ఇందిరమ్మ రాజ్యం కార్యక్రమం ప్రారంభమైంది.

Next Story

Most Viewed