SBI: రూ. లక్ష కోట్ల లాభాల మార్కు దాటే తొలి ఆర్థిక సంస్థగా ఎస్‌బీఐ: ఛైర్మన్

by S Gopi |
SBI: రూ. లక్ష కోట్ల లాభాల మార్కు దాటే తొలి ఆర్థిక సంస్థగా ఎస్‌బీఐ: ఛైర్మన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రూ. లక్ష కోట్ల లాభాలను సాధించిన మొదటి ఆర్థిక సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని బ్యాంకు ఛైర్మన్ సీఎస్ శెట్టి అన్నారు. ఇది వచ్చే 3-5 ఏళ్లలో సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ 21.59 శాతం వృద్ధితో రూ. 61,077 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రైవేట్ రంగ మూలధన వ్యయం పెరుగుతుందని, మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్, ముఖ్యంగా రోడ్లు, పునరుత్పాదక ఇంధనం, రిఫైనరీల నుంచి రుణాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నామని శెట్టి తెలిపారు. లాభాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ వంటివి సంస్థకు చాలా ముఖ్యమైన అంశాలు. ఇదే సమయంలో వినియోగదారులకు అందించే సేవలకు ప్రాధాన్యత ఇస్తూ, కార్యకలాపాలను మరింత మెరుగ్గా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. కార్పొరేట్ రుణాలకు సంబంధించి డిమాండ్ బలంగా ఉందని, ప్రభుత్వం నుంచి ఇప్పటికే సంస్థ రూ. 4 లక్షల కోట్ల క్రెడిట్ సౌకర్యాన్ని పొందిందని, ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రైవేట్ రంగ మూలధన వ్యయం పెరుగుతుందని ఆయన వెల్లడించారు.

Next Story

Most Viewed