తెలంగాణ చరిత్రలో పాలమూరు జిల్లా పేరు సుస్థిరం : సీఎం కేసీఆర్​

by Kalyani |   ( Updated:2024-02-03 13:27:47.0  )
తెలంగాణ చరిత్రలో పాలమూరు జిల్లా పేరు సుస్థిరం : సీఎం కేసీఆర్​
X

దిశ, మహబూబ్ నగర్/కోస్గి : తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి పాలమూరు జిల్లా పేరు సుస్థిరంగా , చిరస్థాయిగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. బుధవారం మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రం, కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండల కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో మహబూబ్ నగర్ ఎంపీగా ఉండి పోరాటాలు సాగించాను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని ముఖ్యమంత్రి చెప్పారు. మీరిచ్చిన ప్రోత్సాహం.. ఉత్సాహమే తెలంగాణలో సాధించి పెట్టింది. అందుకే తెలంగాణ చరిత్రలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ వచ్చాక కరువు కాటకాలతో ఉన్న పాలమూరు జిల్లాను ఎంతో అభివృద్ధి చేసుకుందామని ముఖ్యమంత్రి చెప్పారు.

మన బతుకులు బాగుపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రుల సంకన ఉన్న రేవంత్ రెడ్డి ఒక దబ్బుల్ బాజీ. మాయమాటలు చెప్పి అధికారంలోకి రావాలని కలలు కంటున్నాడు. ఆ పార్టీకి 20 స్థానాలకు మించి రావు అని ముఖ్యమంత్రి చెప్పారు. ఓటుకు నోట్లు కేసులో జైలుకు వెళ్లి చిప్పకూడు తిన్న దానివల్ల నాకు మంచే జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాకు, రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. 24 గంటలు కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా.. లేక మూడు గంటలు కరెంటు కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి కోసం పోరాడే వారి చేతికి కట్టిస్తే ప్రయోజనం ఉంటుంది కానీ వేరే వాళ్లకు ఇవ్వడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

శ్రీనివాస్ గౌడ్, నరేందర్ రెడ్డిని…వారినిఉన్నత స్థానంలో నిలుపుతా

రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మళ్లీ గెలిపిస్తే ఉన్నత ప్రస్థానంలో నిలుపుతాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. శ్రీనివాస్ గౌడ్, నరేందర్ రెడ్డి ఇద్దరు వారి వారి నియోజకవర్గాలను అన్ని విధాల అభివృద్ధి చేశారని, ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటున్నారని చెప్పారు. అటువంటి వారిని గెలిపించుకునే బాధ్యత మీదే అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

మీ బంటుల పని చేస్తా: మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి పని చేశాను. వారి కుటుంబ సభ్యుడిగా కలిసిపోయి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. పదేళ్ల క్రితం ఎన్నికలు జరిగితే ఈ నియోజకవర్గాన్ని వదిలి పారిపోయి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి కులాలు, మతాల పేర్లతో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి అన్నారు. బీజేపీ అభ్యర్థి సైతం షాద్నగర్ టికెట్టు దొరకక ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ నర్సింలు, డిసిసిబి వైస్ చైర్మన్ కోరుమోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story