మహబూబ్ నగర్ అభివృద్ధికి ఉద్యోగుల సహకారం ఎంతో అవసరం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Sumithra |
మహబూబ్ నగర్ అభివృద్ధికి ఉద్యోగుల సహకారం ఎంతో అవసరం.. మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్ : జిల్లాలో ఉద్యోగులందరూ కలిసికట్టుగా పనిచేసి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్దిని ఊహించని స్థాయికి తీసుకువెళ్ళడంలో ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో నిర్మించనున్న జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధనే ధ్యేయంగా టీజీవో సంఘము ఏర్పాటు అయిందని, రాష్ట్రంలో గుర్తింపు పొందిన అతిపెద్ద సంఘంగా టీజీఓ ఉందని అన్నారు.

సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరించుకుంటూ వెళ్తామని, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్రాన్ని దేశంలో ముందు వరుసలో నిలిపేందుకు, అలాగే జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేందుకు ఉద్యోగులు కష్టపడి పనిచేసి, జిల్లాకు మంచి పేరు తేవాలని ఆయన కోరారు. జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం భవనానికి 50 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించడంతోపాటు, 3, 4 అంతస్తులతో భవనాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో వసతితో పాటు, ఇతర సౌకర్యం కోసం 3 కోట్ల రూపాయల వ్యయంతో టీజీవో భవనాన్ని నిర్మిస్తున్నామని జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ ప్రకటించడం హర్షణీయమని అన్నారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తానని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి జిల్లా టిజిఓ సంఘం అధ్యక్షులు రాజగోపాల్, కార్యదర్శి బక్క శ్రీనివాస్, రాష్ట్ర సెంట్రల్ సెక్రటరీ సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ కేసి నరసింహులు, మడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, సెక్రటరీ చంద్రనాయక్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు చిన్న కిష్టన్న, 4వ తరగతి సంఘం జిల్లా అధ్యక్షులు నరేందర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పరమేశ రెడ్డి, కమర్షియల్ టాక్స్ సంఘం అధ్యక్షులు వెంకటయ్య, పీఆర్టీయుల సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణ గౌడ్, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు సాయిలు గౌడ్, కిష్టన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed