Collector : విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి

by Kalyani |
Collector : విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి
X

దిశ, గద్వాల్ కలెక్టరేట్/ఉండవెల్లి : ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు. గురువారం ఉండవెల్లి మండలంలోని ఎస్సీ బాలుర వసతి గృహంను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో రూమ్స్ , త్రాగునీటి సరఫరా, కిచెన్ రూం , పరిశుభ్రతను పరిశీలించారు. వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య, ఏ తరగతిలో చదువుతున్నారు, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, పాఠశాల టైమింగ్స్, హాస్టల్ నుంచి పాఠశాలకు ఎంత దూరమని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో 120 మంది విద్యార్థులు, 3 గదులు, 4వ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు, ఒక వంట మనిషి, వాచ్ మెన్, ఇద్దరు ట్యూటర్స్ ఉన్నారని జిల్లా కలెక్టర్ కు వసతి గృహ నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటుందా.. అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. విద్యార్థులతో పాఠాలు చదివించారు. చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు. పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాత వసతి గృహాన్ని కూడా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యమైన విద్య, భోజన మెనూ ప్రకారం గా అందించాలని సూచించారు. వారి చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమని తెలిపారు. అనంతరం అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని పి.జె.పి క్యాంప్ లోని ప్రభుత్వ క్వార్టర్స్ ను పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తి కాకుండా ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేసి ఆసుపత్రి సిబ్బందికి మెరుగైన వసతులు సౌకర్యలు కల్పించాలన్నారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శ్వేత ప్రియ దర్శిని, తహశీల్దార్ సాలిముద్దీన్, ఎ ఎస్ డబ్లు సరోజ వసతి గృహాల ప్రత్యేక అధికారులు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed