పడకేసిన.. పశువైద్యం

by Naveena |
పడకేసిన.. పశువైద్యం
X

దిశ, అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండల పరిధిలోని గ్రామాల్లో పశువైద్యం పడకేసింది. మూగజీవాలే కదా..చచ్చినా... ప్రశ్నించేవారెవరు అనే తీరులో వైద్య సేవలు జరుగుతున్నాయి. మానోపాడు మండల కేంద్రంలోని పశువైద్యశాల పరిస్థితి దయనీయంగా మారింది. మూగజీవాలకు సరైన వైద్యం అందకపోవడంతో..రోగాల బారినపడి పశువులు చచ్చిపోతున్న పట్టించుకోవడం లేదు. అటెండర్లు,గోపాలమిత్రల వైద్యమే ఆ పశువుల ఆసుపత్రికి దిక్కవుతోంది. పశుపోషణపై ఆధారపడిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గొర్రెలను,ఆవులను,గేదలను,సేద్యం చేసే ఎద్దులను వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకొచ్చి.. మందులు లేవని, వైద్యం అందాలంటే ప్రైవేట్ మెడికల్ షాపులతో..మందులు తీసుకొస్తే తప్ప వైద్యం చేయడంలేదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మానవపాడు మండల కేంద్రంలోని పశువైద్యశాలకు చాలామంది రైతులు తమ జీవాలను తీసుకొచ్చారు. వైద్యం అందించడానికి మందులు లేవని అక్కడున్న సిబ్బంది చెప్పడంతో..రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత తొమ్మిది నెలలుగా తిరుగుతున్న మందులు లేవని చెప్పడం ఏమిటని, ప్రైవేట్ మెడికల్ షాపులకు వెళ్ళమని చెప్పడం దేనికోసమని మండిపడ్డారు. పశువులకు వైద్య సేవలు అందించలేనప్పుడు ఆస్పత్రి మూసివేయామని రైతులు నిరసన తెలిపారు. అటెండర్ మాత్రమే పశు వైద్యశాలలో కనిపిస్తాడని, మిగతావారు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఆస్పత్రి ముందు జరుగుతున్న విషయాన్ని అటెండర్ ఫోన్ తో జిల్లా అధికారులకు తెలిపారు. వారం రోజుల్లో మందులు వచ్చే విధంగా పరిష్కారం చూపుతామని అధికారులు తెలపడంతో.. రైతులు శాంతించారు. ఈ వారంలోపు పశు వైద్యశాలకు సరైన మందులు రాకపోతే ఆసుపత్రిని ముట్టడించి తాళం వేసి ధర్నా చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Next Story