పట్టణాలన్నీ మహానగరాలుగా మారుతున్నాయి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Sumithra |
పట్టణాలన్నీ మహానగరాలుగా మారుతున్నాయి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పట్టణాలలో అనూహ్యమైన మార్పులు వచ్చి, మహానగరాలుగా మారుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు తాగునీరు అందిస్తున్నామని, విద్యుత్ సమస్య సైతం తీర్చామని, పట్టణంలో పార్కులు అభివృద్ధి చేశామని, 6 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, 6 కళాశాలలు ఏర్పాటు చేశామని, రహదారులు, జంక్షన్ లను అభివృద్ధి చేస్తూ, ఐటీ పార్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టణ కూడళ్ళను అందంగా తీర్చి దిద్ధితూ ఇంకా మరింత అభివృద్ధి చేస్తామని, త్వరలో పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, ప్రత్యేకించి పాలమూరు పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత పట్టణాలలో మౌలిక సదుపాయాలు పెరిగాయని, పట్టణాల అభివృద్ధి కై చాలా కార్యక్రమాలు చేపట్టామని వివిధ నిధుల ద్వారా చిన్న పట్టణాలను సైతం పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామని, అధికారులు, సిబ్బంది ఇదే స్ఫూర్తితోపని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు మాట్లాడుతూ తెలంగాణ రాకపూర్వం మహబూబ్ నగర్ పట్టణం ఎలా ఉందో ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు గమనించాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది మంత్రిని గజమాలతో సత్కరించగా, ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్ ఉద్యోగులకు, ఉత్తమ సర్వీసులు అందించిన సంస్థలు, ఇతర పారిశుధ్య కార్మికులను మంత్రి సన్మానించారు. జిల్లా ఎస్పీ కె.నరసింహ, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, కమిషనర్ ప్రదీప్ కుమార్, కౌన్సిలర్లు, మున్సిపల్ ఇంజనీర్లు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

Advertisement

Next Story