నడిగడ్డపై కేటీఆర్ నజర్..! గద్వాల జిల్లా ముఖ్య నేతలతో వరుస సమావేశాలు

by Shiva |
నడిగడ్డపై కేటీఆర్ నజర్..! గద్వాల జిల్లా ముఖ్య నేతలతో వరుస సమావేశాలు
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: నడిగడ్డ ప్రాంతంగా పిలువబడే జోగులంబ గద్వాల జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరగా.. త్వరలోనే మరో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ పార్టీ శ్రేణులలో మనోధైర్యం నింపేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14అసెంబ్లీ స్థానాలలో గద్వాల, అలంపూర్ అసెంబ్లీ స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు గెలుపొందారు. మరోవైపు ఎమ్మెల్సీగా చల్లా వెంకటరామిరెడ్డి గెలవడంతో ఆ పార్టీ నడిగడ్డన గతనెల క్రితం వరకు బలోపేతంగా ఉంది.

ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఉండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కొంత ధైర్యం ఉండేది. అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ అధినేతల ఆకర్షణల మంత్రం, రాజకీయ పరిణామాల నేపథ్యంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇది చాలదు అన్నట్లు గోరుచుట్టపై రోకలి పోటు అన్న చందంగా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవైపు ప్రచారం జరుగుతుండగానే ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరాలి అంటే తప్పనిసరిగా అధికార పార్టీలో చేరాల్సిందే అన్న నిర్ణయానికి ఎమ్మెల్సీ చల్ల వచ్చినట్లు సమాచారం. నడిగడ్డను జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలను పిలిపించుకొని కీలక సమావేశాలు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తూ .. పార్టీలో కొనసాగాలని సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గర స్థాయి నాయకులు లేకపోవడంతో బీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్తితులు ఏర్పడనున్నాయి.

ఆషాడం ముగిసే.. శ్రావణం వచ్చే

ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉన్నా ఆషాడ మాసం ఉండడంతో వాయిదా వేసుకున్నట్లు సమాచారం. బుధవారంతో ఆషాడ మాసం ముగిసి శ్రావణమాసం ప్రవేశిస్తుండడంతో రాజకీయ వర్గాలు అంతా తమ దృష్టిని అలంపూర్ వైపు సారిస్తున్నారు. ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు ఈ నెలాఖరు లోపు లేదా.. వచ్చేనెల మొదటి వారంలోపు శుభ దినాలను చూసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వారి అనుచరులు అంటున్నారు.

త్వరలోనే గద్వాలకు కేటీఆర్..

నడిగడ్డ ప్రాంతంలో బీఆర్ ఎస్ ను బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్వరలోనే పర్యటించనున్నట్లు తెలుస్తోంది. గద్వాల, అలంపూర్లలో పర్యటించి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలను గుర్తించి పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను వారికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీ మందా జగన్నాథం అలంపూర్ నియోజకవర్గ బరువు బాధ్యతలను తీసుకొని ముందుకు కొనసాగిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది.. మొత్తంపై బీఆర్ఎస్ నడిగడ్డన పూర్వ వైభవం తెచ్చుకోవాలంటే అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

Next Story