Bangladesh : 18 మంది ‘బంగ్లా’ హిందువులపై దేశద్రోహం కేసు ?

by Hajipasha |   ( Updated:2024-11-01 15:53:16.0  )
Bangladesh : 18 మంది ‘బంగ్లా’ హిందువులపై దేశద్రోహం కేసు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్‌(Bangladesh)లో హిందూ సంఘాల నాయకులపై వేధింపులు పెరిగిపోయాయి. దాదాపు 18 మంది హిందూ నేతలపై దేశద్రోహం(Sedition case) కేసులు నమోదు చేశారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఛటోగ్రామ్ నగరంలోని పుండరీక్ ధామ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిపైనా ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అక్టోబరు 25న ఛటోగ్రామ్ నగరంలోని లాల్ దిఘి ఏరియాలో హిందూ సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. హిందువుల(Hindus)పై వేధింపులు, దాడులకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. మైనారిటీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. అయితే అక్టోబరు 25వ తేదీనే లాల్ దిఘి ఏరియాకు 2 కి.మీ దూరంలోని మరో ఏరియాలో కొందరు యువకులు హల్‌చల్ చేశారు.

బంగ్లాదేశ్ జాతీయ పతాకం ఉన్న పోల్‌కు.. దాని కంటే ఎక్కువ ఎత్తులో కాషాయ పతాకాన్ని కట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని ఆధారంగా ఆ రోజు నిరసన తెలిపిన హిందూ సంఘాల నాయకుల్లో 38 మందిపై దేశ ద్రోహం కేసును నమోదు చేయాలంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా 18 మందిపై దేశ ద్రోహం కేసును నమోదు చేశారనే ప్రచారం జరుగుతోంది. మిగతా 20 మందిలో పలువురిపై ఈ కేసును నమోదు చేస్తారని అంటున్నారు. వాస్తవానికి నేరుగా దేశ ద్రోహం కేసును నమోదు చేసే అధికారం బంగ్లాదేశ్ పోలీసులకు లేదు. అందుకోసం దేశ హోంశాఖ ఉన్నతాధికారుల అనుమతిని పొందాల్సి ఉంటుంది. ఇక కాషాయ పతాకాన్ని యువకులు కట్టిన వ్యవహారంతో తమ సంబంధం లేదని చిన్మయ్ కృష్ణదాస్ స్పష్టం చేశారు. తమ నిరసన స్థలం.. జెండాలు కట్టిన ప్రదేశం చాలా దూరంలో ఉన్నాయని తేల్చి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed