అటవీ భూమి సమస్యలను పరిష్కరించండి

by Naveena |
అటవీ భూమి సమస్యలను పరిష్కరించండి
X

దిశ,నవాబుపేట : ఫతేపూర్ మైసమ్మ దేవాలయ అభివృద్ధికి ఆటంకంగా మారిన అటవీ భూమి సమస్యను పరిష్కరించి ఆలయాభివృద్ధికి చేయూతనివ్వాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో అటవీశాఖ భూ వివాదాలకు సంబంధించిన అంశంపై జరిగిన చర్చలో అనిరుధ్ రెడ్డి ఫతేపూర్ మైసమ్మ ఆలయ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అటవీ భూమి సమస్యను లేవనెత్తారు. నవాబుపేట మండల పరిధిలో ఉన్న ఫతేపూర్ మైసమ్మ ఆలయం అప్పన్నపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉండటంతో..ఆలయ ప్రాంగణంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం లేకుండా పోతోందని ఆయన వాపోయారు. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకొనే ఈ ఆలయం అభివృద్ధికి ఆటంకంగా ఉన్న భూ సమస్యను పరిష్కరించి ఆలయం చుట్టుపక్కల అటవీ భూమిని ఆలయానికి ఇచ్చే విషయంగా డీఎఫ్ఓ ప్రతిపాదనలు కూడా పంపారన్నారు. అక్కడున్న అటవీ భూమికి బదులుగా మరో ప్రాంతంలో 5 ఎకరాల భూమిని అటవీశాఖకు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ కూడా సిద్ధంగా ఉన్నారని అనిరుధ్ రెడ్డి తెలిపారు. మరో ప్రాంతంలో ప్రభుత్వం కేటాయించే 5 ఎకరాల భూమిని తీసుకొని ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ఉన్న అటవీభూమిని ఆలయానికి ఇస్తే మైసమ్మ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. అటవీ భూమి సమస్యను పరిష్కరించి ఆలయాభివృద్ధికి చేయూతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అందుకు స్పందించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బదులిస్తూ అటవీ భూ వివాదాలు అనేక ప్రాంతాల్లో ఉన్న మాట వాస్తవమేనని, ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story