కంపు కొడుతున్న డంపింగ్ యార్డ్.. ఆచూకీ లేని బయో మైనింగ్

by Aamani |
కంపు కొడుతున్న డంపింగ్ యార్డ్.. ఆచూకీ లేని బయో మైనింగ్
X

దిశ ప్రతినిధి వనపర్తి : జిల్లా కేంద్రం సమీపంలోని నాగవరం గుట్టలు అంటే ఒకప్పుడు పచ్చని ప్రకృతితో పక్షుల కిలకిల రావాలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో కనిపించేవి. ప్రజలు ఆ వాతావరణం ఆస్వాదించడానికి ఆసక్తి కనబరిచేవారు. అలాంటిది ఆ గుట్టల నడుమ ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు తో అక్కడి వాతావరణం అంతా తలకిందులైంది. జిల్లా కేంద్రంలో రోజు వెలుపడే చెత్తనంతా అక్కడ డంపు చేయటంతో చెత్త నిలువలే ఒక గుట్టలా తయారైంది. తీవ్ర దుర్గంధం, కంపు వాసన, కలుషితమైన నీటి గుంటలతో ఇప్పుడు ఆ గుట్టల వైపు వెళ్లాలంటేనే జనాలు జడుసుకొని ముక్కులు మూసుకుంటున్నారు. ఆ కంపు వాసనలు భరించలేక చివరికి డంపింగ్ యార్డ్ నే ఇక్కడి నుంచి తరలించాలని సమీప ప్రజలు చెత్తను తరలించే ట్రాక్టర్లను అడ్డుకుంటున్నారు.

నిర్వహణ శూన్యం...

ఆరు సంవత్సరాల క్రితం నాగవరం గుట్టల మధ్య నాలుగున్నర ఎకరాలలో డంపింగ్ యార్డ్ ను ప్రారంభించారు. తడి పొడి చెత్తను వేరు చేసి బయో మైనింగ్ ద్వారా ఎరువులు తయారు చేయాలని లక్ష్యం కనుచూపుమేరలో కూడా కనిపించడం లేదు. గత కొన్నేళ్లుగా డంపింగ్ యార్డ్ నిర్వహణను గాలికి వదిలేశారు. తడి పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియ సైతం నిలిచిపోయింది. ప్రతిరోజు జిల్లా కేంద్రంలో ఇంటింటి నుంచి సేకరించే చెత్త నిల్వలను ఆ గుట్టల నడుమనే డంపింగ్ చేస్తూ వస్తున్నారు. దీంతో చెత్తను వేరు చేయడానికి నిర్మించిన షెడ్డు, గదుల వద్దకు వెళ్లడానికి కూడా దారి లేకుండా వ్యర్ధాలతో నిండిపోయింది. ఇక ప్రతిరోజు ట్రాక్టర్ ద్వారా పారిశుద్ధ్య సిబ్బంది తీసుకువచ్చే చెత్తను అలాగే పోస్తూ వెళ్లడంతో సహజంగా ఉన్న గుట్టలను మించిపోయేలా పెద్ద కొండలా పేరుకుపోయింది. ఇక బయో మైనింగ్ చేయడానికి సిడీఎంఏ నిర్వహించిన టెండర్లలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎస్ డి ఎస్ కంపెనీ పనులను దక్కించుకోంది. కానీ ఇప్పటివరకు బయో మైనింగ్ చేసే యంత్రాలను బిగించనేలేదు. అలాగే ఎంత చెత్తను రీసైక్లింగ్ చేశారు అని తెలుసుకోవడానికి ఏర్పాటు చేయాల్సిన వేయింగ్ మిషన్ సైతం బిగించనేలేదు. దీంతో వనపర్తి జిల్లా కేంద్ర సమీపంలోని డంపింగ్ యార్డ్ చెత్త నిల్వలతో అస్తవ్యస్తంగా తయారై కంపు కొడుతోంది.

పేరుకు పోయి 50 వేల టన్నులకు చేరిన వ్యర్థాలు...

వనపర్తి మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు ఉండగా 13 ట్రాక్టర్లు, 15 ట్రాలీ ఆటోల ద్వారా ప్రతిరోజు ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేస్తున్నారు. పట్టణంలో అన్ని వార్డులు కలిపి ప్రతినిత్యం దాదాపు 25 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. గత ఆరేళ్ల నుంచి ఇలా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులో పారబోస్తూ వస్తున్నారు. చెత్తను రీసైక్లింగ్, బయో మైనింగ్ చేయకపోవడంతో 50 వేల టన్నులకు పైగా చేరుకొని కొండలా పేరుకుపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు చెత్త నిల్వలు తడిసిపోవడంతో వాటి నుంచి కలుషిత నీరు వెలువడి సమీపంలో ఉన్న నీటి గుంటల్లో చేరి ఆ నీటిని కూడా కలుషితంగా మార్చివేసింది. ఈ ప్రభావంతో సమీపంలో ఉన్న పంట పొలాల్లోని బోరు బావుల్లో సైతం కలుషిత నీరు వస్తుందని సమీప ప్రజలు వాపోతున్నారు.

డంపింగ్ యార్డు తరలించాలని డిమాండ్...

జిల్లా కేంద్రంలోని నాగవరం సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ను అక్కడ నుంచి తరలించాలని ఆ వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. యార్డును స్థాపించినప్పటి నుంచి రీసైక్లింగ్, బయో మైనింగ్ చేపట్టకపోవడంతో నాలుగున్నర ఎకరాలలో ఉన్న చెత్తని నిల్వలతో నిండిపోయిందని, చివరకు రోడ్లపైనే చెత్తను పారబోస్తున్నారని ప్రజలు పారబోయడానికి వచ్చే ట్రాక్టర్లను మంగళవారం అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ అక్కడ చేరుకుని సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి త్వరగా మిషనరీ తెప్పించి రీసైక్లింగ్ చేపడతామని చెప్పారు. అయితే ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి జిల్లా కేంద్రానికి దూరంగా డంపింగ్ యార్డ్ ను తరలించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed